రాయగడ: ప్రతి చిన్నారీ చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆకాంక్షించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, విద్య హక్కు అమలు, వివిధ శాఖల సమన్వయ చర్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాయగడ జిల్లా పరిషత్ సమవేశ మందిరంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఈఎస్‌ఐ శాఖలు సంయుక్తంగా ‘ప్రతి చిన్నారి –చదవాలి –ఎదగాలి–కలలు కనాలి’ అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో బాల కార్మిక నిర్మూలన చట్టాలు, బాలల హక్కులు, విద్యావకాశాలు, పునావాస చర్యలు, శాఖల మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రాబల్యం గల ఈ జిల్లాలో బాలల విద్య, భద్రత, సమగ్ర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం అత్యున్నత స్థాయి ప్రాధాన్యం కల్పిస్తుందని వివరించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ బబితా పాత్రొ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ చట్ట విరుద్ధమే కాకుండా చిన్నారుల హక్కులు, భవిష్యత్‌కు తీవ్రమైన దెబ్బగా అభివర్ణించారు. పేదరికం, నిరక్ష్యరాస్యత మాకద్రవ్యాల వ్యసనం, భిక్షాటన, బాలల అక్రమ రవాణా వంటి అంశాలు బాల కార్మిక వ్యవస్థ పెరుగుదలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నిర్మూలించడానికి సమాజంలొ ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎస్పీ రాజ్‌ప్రసాద్ మాట్లాడుతూ బాల కళాకారులు, బాల కార్మికుల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా వివరించారు. నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెషర్ విరాజ్ స్వయిన్ మాట్లాడుతూ బాల, కిశోర కార్మిక చట్టం–1986, ఒడిశా నిబంధనలు –2017, బాల న్యాయ చట్టం –2015 , విద్యాహక్కు చట్టం –2009 మధ్య ఉన్న అనుసంధానాన్ని వివరించారు.


