జయపురం: కొరాపుట్ జిల్లాలో పేరెన్నికగన్న కొంచాసు మామిడి రానురాను కనుమరుగవుతోంది. కొంచాసు మామిడి కాయలను గ్రామీణ ఆదివాసీ ప్రజలు పట్టణాల రోడ్డు సైడ్‌లలో కాయలను పోగులు వేసి అమ్ముతారు. మామిడి సీజన్ వచ్చిందంటే కొంచాసు మామిడి కాయల కోసం ప్రజలు ఎదురు చూసేవారు. ప్రస్తుతం ఈ కాయలు మార్కెట్‌లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఒక పాత్రికేయుడు కొరాపుట్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందించి కొరాపుట్ జిల్లాలో తప్ప మరే ప్రాంతంలో కనిపించని కొంచాసు మామిడి మొక్కలను పెంచేందుకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని జయపురం ఉద్యానవన విభాగ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశం మేరకు జయపురం ఉద్యానవన విభాగ డిప్యూటీ డైరెక్టర్ సంజీవ కుమార్ మహంత, ఉద్యానవన సహాయకుడు శేఖర్ చంఽద్రదాస్‌లు అతి కష్టంతో కొంచాసు మామిడి టెంకలను సేకరించి వాటిని ఒక ప్రత్యేక నర్సరీలో నాటారు. మొక్కలు మొలకెత్తటంతో వాటిని జయపురం సమితి హొరడాపుట్ నర్సరీలో 1500 మొక్కలను పెంచారు. ఒక మొక్కను రూ.45కు అందజేయాలని నిర్ణయించినా, ఈ అపూర్వ జాతి కొంచాసు మామిడి మరింత చౌకగా రైతుకు, ప్రజలకు అందేటట్టు చేసేందుకు రాయితీ ప్రకటించి కేవలం రూ.20 లకే అందిస్తున్నట్లు జయపురం ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ సంజీవ కుమార్ మహంత నేడు పత్రికల వారికి వెల్లడించారు.


