జయపురం: జయపురం దేవదాయ కమిటీ నూతన అధ్యక్షునిగా కాంగ్రెస్ నేత, జయపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు దేవేంద్ర బాహిణీపతి ఎన్నికయ్యారు. జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ పరిచాలన కమిటీ ఎన్నికకు ఏకగ్రీవంగా కమిటీ అధ్యక్షునిగా ఎన్నిక చేయాలన్న ప్రయత్నం ఫలించకపోవటంతో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్ష పదవికి బాహిణీపతితో సందీప్ సామంతరాయ్ తలపడ్డారు. దేవేంద్ర బాహిణీపతికి 9 మంది ఓటు వేయగా, సామంతరాయ్‌కు 6 ఓట్లు వచ్చాయి.
వ్యక్తి సజీవ దహనం
భువనేశ్వర్: బాలాసోర్ ప్రాంతంలోని ఐటీఐ రోడ్డులో ఉన్న రసాయన కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పారిశ్రామిక వాడ పోలీస్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం ప్రత్యక్షంగా సందర్శించారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బైక్ దొంగతనం కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టుకు తరలించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశామని ఐఐసీ ప్రసన్నకుమార్ బెహర తెలిపారు.
కన్యకాపరమేశ్వరికి
ప్రత్యేక పూజలు
రాయగడ: పట్టణంలోని కొరాపుట్ కూడలిలో వైశ్యుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి మందిరంలో ఆదివారం అధిక జ్యేష్ఠపౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని మామిడి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 7.30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కుంకుమ, గులాబీ రేకులు, మల్లెపూలతో 108 అష్టోత్తర శతనామావళి పఠనంతో భవ్యమైన పూజ నిర్వహించారు. విశేష పూజల్లో పాల్గొన్న భక్తులకు అఖండ సౌభాగ్యం, అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధించడంతో పాటు గ్రహ దోష నివారణ కలిగి అమ్మవారి అనుగ్రహం లభిస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. అనంతరం నిర్వహించిన కుంకుమపూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


