● అస్నా గ్రామ పంచాయతీలో
క్రీడా సందడి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి అస్నా గ్రామ పంచాయతీలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి ఆటలో ముర్జా గ్రామ టీమ్ విజయం సాధించింది. ప్రారంభ పోటీలో ముర్జ గ్రామ టీమ్ కందులిముండ టీమ్‌లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ముర్జా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పద ఓవర్లలో 120 పరుగులు చేసింది. 121 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కందులిముండ టీమ్ నిర్ణీత పది ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రం చేయగలిగింది. దీంతో ముర్జ గ్రామ జట్టు 23 పరుగుల ఆధిక్యతతో విజయాన్ని దక్కించుకుంది. పోటీలను దివాకర గౌఢ, మీనకేతన గౌఢ, నరశింహ గౌడ్, దిలీప్ గౌడ్, ఘన గౌఢలు పర్యవేక్షించారు. పోటీలను కొరాపుట్ జిల్లా భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యదర్శి చంద్ర శేఖర రథ్ ముఖ్యఅతిథిగా హాజరై టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల దుర్గమ ప్రాంతం అస్నా గ్రామ పంచాయతీలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించటం ఈ ప్రాంత యువత క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అవసరమైన వనరులు సమకూర్చుతుందని అన్నారు. ఆటలలో గెలుపు ఓటమిలు ప్రధానం కాదన్నారు. మానసిక, శారీరక వికాసానికి క్రీడలు దోహద పడతాయన్నారు. క్రీడాకారులు ఆటలలో రాణించి రాష్ట్ర, జాతీయ క్రీడారంగంలో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్‌లో 16 జట్టు పాల్గుంటున్నాయి. టోర్నమెంట్ 15 రోజులు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో కొట్‌పాడ్ ఎంఎల్‌ఏ ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్య, కొరాపుట్ జిల్లా ఐటీ సెల్ కోఆర్డినేటర్ సంతోష్ ప్రహరాజ్, దిగాపూర్ బీజేపీ మండల అధ్యక్షులు ధనపతి పొరజ,లయిచన్ గౌఢ,సుబాష్ మఝి అతిథులుగా హాజరయ్యారు.


