భారతీయ విలువలతో
భువనేశ్వర్: ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భవిష్యత్ సవాళ్లకు రాష్ట్రాన్ని సిద్ధం చేయడంలో ఉన్నత విద్యా సంస్థలు కీలక పాత్ర పోషించాలని, ఒడిశాలోని విశ్వ విద్యాలయాలు భారతీయ విలువలలో లోతుగా పాతుకుపోయి, ప్రపంచ స్థాయిలో పోటీపడగల సామాజిక బాధ్యత కలిగిన, సాంకేతికంగా అభివద్ధి చెందిన సంస్థలుగా ఎదగాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆది వారం పిలుపునిచ్చారు. లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్‌లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల సదస్సులో ప్రసంగిస్తూ ఒడిశాలో ఉన్నత విద్య భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం ఒక ముఖ్యమైన సామూహిక ప్రయత్నమని గవర్నర్ అభివర్ణించారు.
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార శాఖల మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్, పరిశ్రమల శాఖ మంత్రి సంపద్ చంద్ర స్వంయి, ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
వైస్‌చాన్స్‌లర్లకు గవర్నరు స్వాగతం పలుకుతూ విశ్వ విద్యాలయాలు జ్ఞానం, ఆవిష్కరణలు, నాయకత్వానికి కేంద్రాలు. దేశ నిర్మాణంలో వాటికి కీలక బాధ్యత ఉందన్నారు. వేగవంతమైన సాంకేతిక పురోగతులు, కొత్తగా వస్తున్న విజ్ఞాన శాస్త్రాలు, మారుతున్న ప్రపంచ సవాళ్ల కారణంగా ప్రపంచం అపూర్వమైన పరివర్తనకు లోనవుతూ మరింత సంక్లిష్టంగా మారుతున్న భవిష్యత్తును ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, విలువలతో ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థులను సన్నద్ధం చేయాలని గవర్నర్ ప్రేరేపించారు.
విశ్వ విద్యాలయాలు వ్యవస్థాపకతను, ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, తద్వారా యువతను సమాజంలో వృద్ధి, అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం (ఎనన్‌ఈపీ) 2020 విధానం బహుళ విజ్ఞానశాస్త్ర విద్య, విద్యాపరమైన సౌలభ్యం, నైపుణ్యాల ఏకీకరణ, డిజిటల్ అభ్యాసం, పరిశోధనలో శ్రేష్టత, బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఒడిశా గొప్ప గిరిజన వారసత్వంపై దృష్టిని ఆకర్షిస్తూ, దేశీయ జ్ఞాన వ్యవస్థలు, గిరిజన సంప్రదాయాలు, సాంస్కృతిక పరిరక్షణపై అర్థవంతమైన పరిశోధనలు చేపట్టాలని గవర్నర్ విశ్వవిద్యాలయాలను కోరారు. లోక్ భవన్‌లోని ట్రైబల్ సెల్ రూపొందించిన ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల వివరాలను నమోదు చేసే ప్రచురణలను, విద్యా, పరిశోధన కార్యక్రమాలకు మద్దతుగా విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉంచుతామని ఆయన సభికులకు తెలియజేశారు.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదని, అవి జ్ఞాన సృష్టి, ఆవిష్కరణ, పరిశోధనలకు కేంద్రాలని అన్నారు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను పెంచిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నత విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు.
అభివృద్ధి చెందుతున్న, సుసంపన్నమైన సమాజానికి విద్యే పునాదిగా పేర్కొన్నారు. 2036 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించి వికసిత భారత్ జాతీయ దార్శనికతకు గణనీయంగా దోహదపడాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఒడిశా నిర్దేశించుకుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా జాతీయ ప్రాముఖ్యత గల అంశాలపై చాన్స్‌లర్ కప్, ఇంగ్లీష్ డిబేట్ కోసం చాన్స్‌లర్ కప్, ఒడియా డిబేట్ కోసం చాన్స్‌లర్ కప్‌లను ప్రకటించి, ఆవిష్కరించారు. మత్తు పదార్థాల వ్యసన విముక్తిపై తీసిన లఘు చిత్రాలకు గాను, ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు.


