భువనేశ్వర్: ఒడిశా, చత్తీస్‌గఢ్ మధ్య కొనసాగుతున్న మహానది జలాల పంపిణీ వివాదం విచారణ వాయిదా పడింది. శనివారం వివాద ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ పాక్షికంగా ముగిసింది. ట్రిబ్యునల్ తదుపరి విచారణను జూన్ 6వ తేదీ ఖరారు చేసింది. మహానది జలాల పంపిణీ వివాదం నేపథ్యంలో ఉభయ చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య 15 ప్రధాన అంశాలలో 12 అంశాలపై ఒప్పందం కుదిరిందని ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు రెండూ ట్రిబ్యునల్‌కు తెలియజేశాయి. ఏకాభిప్రాయం ఆధారంగా మరిన్ని పరిష్కారాల కోసం సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. ఒప్పందం కుదిరిన అంశాల్ని ఇరు రాష్ట్రాల న్యాయ, సాంకేతిక బృందాలు పరిశీలించాలని ట్రిబ్యునల్ కోరింది.
కారుని ఈడ్చుకుపోయిన ట్రక్కు
భువనేశ్వర్: నగరంలో కారుని ట్రక్కు ఢీకొట్టి ఈడ్చుకుపోయిన భయంకరమైన ఘటన గగుర్పొడిచింది. ప్రత్యక్షంగా చూసిన వారికి తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బతికి బయట పడ్డారు. స్థానిక సత్య విహార్ స్క్వేర్ సమీపంలో అతి వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొట్టి, పొహలా వైపు రోడ్డుపై దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. అది చివరకు ఒక వంతెనపై ఇరుక్కుపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. కారులో ప్రయాణిస్తున్న మామ, మేనకోడలు తటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మంచేశ్వర్ ఠాణా పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ట్రక్కును స్వాధీన పరచుకున్నారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అనంతరం ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ తెలిపారు. స్థానికుల దాడి భయంతో ఇలా చేసినట్లు డ్రైవర్ పోలీసులకు వివరించాడు.
విద్యాశాఖపై
అధికారుల సమీక్ష
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, సమగ్ర అబివృద్ధి సాధించేందుకు జిల్లా పరిపాలన యంత్రాంగం కీలక చర్య చేపట్టింది. ఇందులో భాగంగా మల్కన్‌గిరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్క్ అధ్యక్షతన శనివారం విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి, జిల్లా మంగళ అధికారి శ్రీనివాస్ ఆచారితో పాటు ఇతర ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా లో విద్యరంగంలో ఏక్కడ నిర్లక్ష్యం పనికిరాదన్నారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలకు సమయానికి వెళ్లాలని ఆదేశించారు.


