జయపురం: జయపురం పోస్టల్ డివిజన్‌లో ఉన్న పోస్ట్ ఆఫీసులో రూ.50 కోట్ల అవినీతి కుంభకోణంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు నవరంగపూర్ జిల్లా ఝోరిగాం తాత్కాలిక సబ్‌పోస్టు మాస్టర్ గౌరంగ సర్కార్‌ను ఉద్యోగం నుంచి జయపురం డివిజన్ చీఫ్ అధికారి సత్య ప్రకాశ మిశ్ర తొలగించారు. రూ.50 కోట్ల అవినీతిలో పలువురికి సంబంధాలున్నాయని భావించారు. నవరంగపూర్ జిల్లాడాబుగాం, కొడింగ పోస్టుమాస్టర్లను బదిలీ చేశారు. డాబుగాం సబ్‌పోస్టు మాస్టర్ శంభుప్రసాద్ పాణిగ్రహిని మల్కనగిరి జిల్లాలో మత్తిలికి, కొడింగ సబ్‌పోస్టు మాస్టర్ బసంత కుమార్ దాస్‌ను మల్కనగిరి పోస్టాఫీసుకు బదిలీ చేశారు. దర్యాప్తు పూర్తయిన తరువాత రూ.50 కోట్ల కుంభకోణంలో సంబంధం ఉన్న అధికారులందరిపైనా తగిన చర్యలు తీసుకుంటామని తపాలా విభాగ అధికారి వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రజాసంక్షమ, సహాయక పథకాల్లో 5 వేల మందికిపైగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పంచిన డబ్బులను కాజేశాిరు. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లోని సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకొని మొబైల్ నెంబర్ మార్చి డబ్బు స్వాహా చేసినట్లు ఇటీవల బీజేడీ నాయకులు చేసిన ఆరోపణ విదితమే. ఉద్యోగం నుంచి తొలగించబడిన ఆనాటి ఝోరిగాం సబ్‌పోస్టు మాస్టర్ గౌరంగ సర్కార్ రూ.7 లక్షల 70 వేలు స్వాహా చేసినట్లు ఆయనే అంగీకరించినట్లు పోస్టల్ విభాగ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర కుమార్ బెహర సమర్పించిన నివేదికలో పొందుపరిచారు. గౌరంగ సర్కార్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు జయపురం డివిజన్ చీఫ్ వెల్లడించారు. కొడింగా సబ్ పోస్టు మాస్టర్ బసంత కుమార్ దాస్ 90 అకౌంట్లు తెరిచి డబ్బు స్వాహా చేశాడని ఆరోపణ. అవిభక్త కొరాపుట్ జిల్లాలలో 41 పోస్టాఫీసుల్లో డబ్బు స్వాహా జరిగినట్లు నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి, మాజీ మంత్రి రబినారాయణ నందో ఆరోపణలను పరిగణలోనికి తీసుకొని పోస్టల్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.


