గజపతి జిల్లా! | - | Sakshi
Sakshi News home page

గజపతి జిల్లా!

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

ఉద్యానవనాల ఖిల్లా

పర్లాకిమిడి: గజపతి జిల్లా ఉద్యానవన జిల్లాగా పేరోందిన తరువాత రామగిరి ప్రాంతంలో అనేకమంది యువతీ యువకులు, స్వయం సహాయక గ్రూపులు రుణాలు తీసుకుని లిచ్చి, మామిడి, అనాస, ద్రాక్ష పండ్లు పండించి ఎగుమతి చేసే దిశకు వచ్చారు. ఆర్‌.ఉదయగిరి బ్లాక్‌ మంగరాజ్‌పూర్‌ గ్రామం, సరసిసాహి, రామగిరి, జిరంగో ప్రాంతాల్లో లిచ్చి పండ్లు ఈ ఏడాది అత్యధికంగా దిగుబడి వచ్చినట్టు జిల్లా ఉద్యానవనాల విభాగం డెప్యూటీ డైరక్టర్‌ దుష్మంత్‌ కుమార్‌ బెహారా తెలియజేశారు. రామగిరి నుంచి గంజాం జిల్లా బరంపురం, ఖుర్దా, భుభనేశ్వర్‌, కటక్‌ పట్టణాలకు ఫ్రెష్‌ ఫ్రూట్స్‌ సప్‌లై అనే బ్లాగుద్వారా యువ ఉద్యోగి మ్యారీ జాన్‌ ఆర్డర్స్‌పై పంపిస్తున్నారు. పర్లాకిమిడిలో అమావాస్య పండుగనాడు లిచ్చి పండ్లు కిలో రూ.200 అమ్మగా, ఇప్పుడు ధరలు దిగివచ్చి కిలో రూ.120, వంద రూపాయలకు అమ్ముతున్నట్టు మంగరాజ్‌పూర్‌ రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇతర జిల్లాల కంటే మామిడి పండ్లు దిగుబడి కూడా భేషుగ్గా ఉన్నట్టు ఉద్యానవనాల శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఒర్మాస్‌ సహకారంతో స్వల్పకాలిక రుణాలు బ్యాంకు నుంచి పొంది అధిక లాభాలు పొందారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు వినియోగించుకుని మహిళా స్వయం సహాయక గ్రూపులు కూడా లిచ్చి, మామిడి, అనాస, నిమ్మ, ఆరెంజి తోటలు విరివిగా పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక గ్రూపులకు మరింత ప్రోత్సాహాకాలు, తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తే గజపతి జిల్లా పండ్లతోటల విస్తరణకు దోహాదం చేస్తుందని మాతరిణీ స్వయంసహాయక గ్రూపు సభ్యులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement