ప్రథమ చికిత్సపై అవగాహప | - | Sakshi
Sakshi News home page

ప్రథమ చికిత్సపై అవగాహప

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

శ్రీకాకుళం కల్చరల్‌: సర్వశిక్ష అభియాన్‌ ఒకేషనల్‌ విభాగం ద్వారా అంపోలులో శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాలకు చెందిన హెల్త్‌ ఇన్‌స్ట్రక్టర్లకు రెడ్‌క్రాస్‌ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ద్వారా ప్రథమ చికిత్సపై శనివారం అవగాహన కల్పించారు. జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు పర్యవేక్షణలో మేనేజర్‌ కె.సత్యనారాయణ, జి.రమణలు ప్రథమ చికిత్స, గాయాలు, కట్లు, తరలింపు మార్గాలు, కృత్రిమ శ్వాస, సీపీఆర్‌, కాలిన గాయాలు తదితర వైపరీత్యాల నుంచి రక్షించుకోవడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాక్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.చిట్టిబాబు, రెడ్‌క్రాస్‌ సిబ్బంది చిన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జూన్‌ 2న జాబ్‌మేళా

శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలోని బలగ హాస్పిటల్‌ జంక్షన్‌లో ఉన్న ప్రభుత్వ ఐటీఐ/డీఎల్‌టీసీ శిక్షణా సంస్థ ప్రాంగణంలో జూన్‌ 2వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. కేవీఆర్‌ ఇంజినీర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముత్తుట్‌ మైక్రోఫిన్‌ లిమిటెడ్‌, 2050 హెల్త్‌కేర్‌ సంస్థల్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్‌మేళాను చేపట్టనున్నట్టు చెప్పారు. ఆకర్షణీయమైన వేతనంతో పాటు అనేక వసతి రాయితీలు ఉంటాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌, ఫార్మసీ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు హాజరవ్వాలని కోరారు. బయోడేటా, విదార్హత ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌ఫొటోలతో ఆరోజు ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం డీఎల్‌టీసీ/ఐటీఐ శిక్షణా సంస్థ వద్దకు చేరుకోవాలని కోరారు.

నేతన్న నేస్తం అమలు ఎన్నడు..?

రణస్థలం: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం ఎప్పటిలోగా అమలు చేస్తారో సమాధానం చెప్పాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ డిమాండ్‌ చేశారు. శనివారం లావేరు పర్యటనలో నేతన్నలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు హామీ అమలు చేయకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న చేనేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. 50 ఏళ్లు దాటినవారికి పెన్షన్‌ అమలు చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు వెంటనే జరిపించాలని, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్‌లూమ్‌ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్‌.అసిరప్పడు, కె.రామారావు, యు.కాశీ విశ్వేశరరావు, ఎన్‌.భద్రకాళి, కె.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రైలు ఢీకొని ఆవు మృతి

పాతపట్నం: మండలంలోని గంగువాడ గ్రామ రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం గంగువాడ రైల్వే గేటు సమీపంలో ఆవు మేత మేస్తోంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి గుణుపూర్‌ వస్తున్న రైలు ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గంగువాడ గ్రామానికి చెందిన సత్రాపు అప్పన్న అనే రైతుకు చెందిన ఆవుగా గుర్తించారు. ఆవు విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందన్నారు. నష్టపోయిన పాడి రైతుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

గాయపడిన వ్యక్తి మృతి

టెక్కలి: జాతీయ రహదారిలో బొప్పాయిపురం సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూన హరిశ్చంద్రరావు (63) శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈనెల 25న రోడ్డు ప్రమాదంలో గాయపడిన హరిశ్చంద్రరావును టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement