రాయగడ:
స్థానిక జిల్లా పరిషత్ సమీవేశం హాల్‌లో శనివారం నాడు నాన్ కేడర్ ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు రెండు రోజుల ప్రాథమిక, రిఫ్రెషర్ శిక్షణ శిబిరం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖ, భువనేశ్వర్‌లోని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ల డైరక్టరేట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిక్షణ శిబిరంలో అపరాధ, న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, కోర్టుల్లో శిక్షల కాలం శాతం పెంచడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వృత్తి పరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ శిక్షణ శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ ప్రారంభంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర కుమార్ శర్మ స్వాగతం పలికారు. అనంతరం రాయగడ డిప్యూటీ డైరక్టర్ ఆప్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అజిత్ కుమార్ పట్నాయక్ అనుమతితో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణి కొత్తగా నియమితులైన ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులు అందజేశారు. అలాగే న్యాయ వ్యవస్థలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల బాధలు, విఽధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత ఎంతో ముఖ్యమని హితవు పలికారు. గౌరవ అతిథిగా హాజరైన ఎస్‌సి రాజ్ ప్రసాద్, రాయగడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్రమ్ కుమార్ కుండు, ప్రభుత్వ ప్లీడర్ పద్మనాభ దాస్ పాల్గొని మార్గనిర్దేశం చేశారు.


