జయపురం: మావోయిస్టు, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉండేందుకు ‘గ్రామోదయ’ యోజన పథకాన్ని జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో శనివారం ప్రారంభించారు. బొయిపరిగుడ సమితి మావో ప్రభావిత చంద్రపడ గ్రామ పంచాయతీ పల్లిగుడలో బొయిపరిగుడ సమితి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొయిపరిగుడ బీడీఓ నివేదిత దండసేన హాజరయ్యారు. బొయిపరిగుడ సమితిలో 20 గ్రామ పంచాయతీల్లో 10 గ్రామ పంచాయతీల పరిధిలోని 23 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పల్లిగుడలో నిర్వహించిన ‘గ్రామోదయ’ యోజన కార్యక్రమంలో పల్లెగుడ గ్రామ ప్రజలతోపాటు బాలిగుడ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రెండు గ్రామాల్లో ప్రభుత్వ ప్రజా సంక్షేమ, సహాయక పథకాలు పొందలేకపోతున్న అర్హులైన లబ్ధిదారులను గుర్తించటం జరుగుతుందని బీడీఓ వెల్లడించారు. గ్రామోదయ పథకం ద్వారా మావో ప్రభావిత గ్రామ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేయ సహాయ పథకాల ఫలితాలు సులభంగా అందేలా చూడటమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి పథకం మావో ప్రభావిత ప్రాంత ప్రజలకు చేర్చేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమైఖ్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పాలకులకు ఉన్న దూరం తగ్గుతుందన్నారు. అందువలన ప్రభుత్వ అధికారుల పట్ల ప్రజలలో నమ్మకం, విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ వాటర్ శానిటరీ విభాగ అధికారులతోపాటు వైద్య, విద్యుత్, విద్య, సామాజిక సురక్షా, సుభద్ర యోజన, అంత్యోదయ యోజన అధికారులు పాల్గొన్నారు.


