జయపురం బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

జయపురం బంద్‌ విజయవంతం

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

జయపురం: జయపురం సమితి గగణాపూర్‌లో గత కొన్నేళ్లుగా మూత పడి ఉన్న సేవాపేపరు మిల్లును వెంటనే పునరుద్ధరించాలనే డిమాండ్‌తో గురువారం జయపురంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. ఈ బందుకు పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు, పలు కార్మిక కర్షక సంఘాలు, ప్రజా సంఘాలు, పలు ట్రేడ్‌ యూనియన్‌లు, కమ్యూనిస్టు పార్టీ, బీజేడీ పార్టీలు జయపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ తదితర సంస్థలు పూర్తిగా మద్దతు తెలిపాయి. జయపురం ఓఆర్‌టీసీ డిపో నుంచి ఒక్క బస్సు బయటకు పోలేదు. అందువలన జయపురం నుంచి నవరంగపూర్‌, మల్కన్‌గిరి, రాయగడ జిల్లాలకే కాకుండా రాష్ట్ర నలుమూలలకు వెళ్లాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్‌ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. అలాగే పట్టణంలోగల బజారులు, వాణిజ్య వ్యాపార సంస్థలు, బ్యాంక్‌లు, జీవిత భీమా సంస్థలు, ప్రధాన తపాలా కార్యాలయం, పట్టణంలో గల ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. జయపురం సమితి గ్రామాల నుంచి నిత్యావసర వస్తువులు తెచ్చే ఆదివాసీ చిరు వ్యాపారులు రాక పోవటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. బీజేడీ పిలుపు మేరకు సేవా పేపరుమిల్లు వెంటనే తెరవాలని డిమాండ్‌ చేస్తూ బీజేడీ శ్రేణులుసేవా పేపరు మిల్లులో, బీజేడీ కార్మిక సంఘ శ్రేణులు రథొపొడియ కూడలి వద్ద మాజీ మంత్రి రబినారాయణ నందో నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు.అలాగనే ఎమ్‌.జి రోడ్డు సంగీత హొటల్‌ జంక్షన్‌లో బీజేడీ కార్యకర్తలు టెంట్‌ వేసి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement