మజ్జిగ వితరణ | - | Sakshi
Sakshi News home page

మజ్జిగ వితరణ

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

పర్లాకిమిడి: ఎండలు తీవ్రంగా ఉండడంతో స్థానిక ఫారెస్టు కూడలి వద్ద గురువారం అఖిల భారత యువజన సేన ఆధ్వర్యంలో పాదచారులకు మజ్జిక వితరణగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు, భారతీయ మానవ హక్కుల పరిషత్‌ అధ్యక్షుడు లక్ష్మీకాంత పాఢి, జిల్లా న్యాయాలయం సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌ కుమార్‌ మిశ్రా, కార్యదర్శి టి.శ్రీకాంత్‌, అఖిల భారత యువజన సేన సభ్యులు వసంతనాయుడు, ప్రశాంత ప్రధాన్‌, జె.వైకుంఠరావు, ఎ.రవి, విక్రం నాయుడు పి.సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

దేవమాలి సందర్శన

కొరాపుట్‌: కొరాపుట్‌ పార్లమెంట్‌ సభ్యుడు సప్తగిరి ఉల్క రాష్ట్ర సరిహద్దులో పర్యటించారు. గురువారం ఒడిశాలోని ముఖ్య పర్యాటక ప్రాంతం కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి దేవమాలి పర్వతం సందర్శించారు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్న విశాఖపట్నం – రాయ్‌పూర్‌ 6 అంచెల ఎకనామిక్‌ కారిడర్‌ సందర్శించారు. రాష్ట్ర సరిహద్దులోని సుంకి సమీపంలో అంపావల్లి వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న కవల టన్నెల్‌లో పర్యటించారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడం, ఎంపీ ప్రతినిధి మనోజ్‌ ఆచార్య ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

పర్లాకిమిడి: గుమ్మబ్లాక్‌ తిత్తిసింగి వద్ద బియ్యం లోడుతో వెళ్తున్న వ్యాన్‌, ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సెరంగో పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అడవ పీఎస్‌ పరిధి గులుబ పంచాయతీ గలిమేరా గ్రామానికి చెందిన చందన్‌ లిమ్మా (18), జీవన్‌ లిమ్మా (14) వీరిద్దరూ సర్టిఫికెట్‌ కోసం గుమ్మ వెళ్తున్నారు. ఆ సమయంలో గారబంద నుంచి గుమ్మ వెళ్తున్న బియ్యం లోడు వ్యాను తిత్తిసింగి గ్రామం మలుపు వద్ద వీరిని ఢీకొనడంతో చందన్‌ లిమ్మా సంఘటన స్థలంలో మృతి చెందాడు. జీవన్‌ లిమ్మాను బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి బాధిత కుటుంబీకులు చేరుకుని నష్ట పరిహారం అందజేయాలని మూడు గంటలపాటు రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

నీటి కోసం కదం తొక్కిన మహిళలు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి చంపాఖారి గ్రామస్తులు గురువారం ఖాళీ బిందెలు పట్టుకుని నీటి కోసం కదం తొక్కారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నందున చుక్క నీరు దొరకడం లేదు. గ్రామంలో 145 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఉన్న ఒక్క బోరు వద్ద గంటల తరబడి క్యూలో ఉంటున్నారు. ఈ గ్రామం పక్కనే సత్తిగూడ జలాశయం ఉంది. అయినా గ్రామానికి పైపులైన్లు వేయలేదు. దీంతో గురువారం జాతీయ రహదారిపై బిందెలు, మట్టి కుండలతో వారు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సమితి కార్యాలయానికి తీసుకువచ్చి చర్చించారు. త్వరలోనే తాగునీటి సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement