రామసాగరం పునరుద్ధరణకు ఇంజినీర్లతో సమావేశం | - | Sakshi
Sakshi News home page

రామసాగరం పునరుద్ధరణకు ఇంజినీర్లతో సమావేశం

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

పర్లాకిమిడి: అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామసాగరం పునరుద్ధరణ పనులపై ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి గురువారం సాయంత్రం మైనర్‌ ఇరిగేషన్‌ ఇంజినీర్లతో కలిసి వెళ్లి సమీక్షించారు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయిక్‌ అనుచరుడు మిషన్‌ శక్తి మాజీ మంత్రి పాండియన్‌ రామసాగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి, ఉన్నతీకరణకు నిధులు కేటాయించారు. అయితే రామసాగరంలో గుర్రపుడెక్క పెరిగిపోవడంతో ప్రభుత్వం సుమారు రూ. 3 కోట్లతో మట్టి తీత పనులు, గుర్రపుడెక్క తీశారు. కానీ పనులు ఎందువల్లనో సగంలో ఆగిపోయాయి. దీంతో తిరిగి రామసాగరంలో మట్టి పేరుకుపోయి తిరిగి గుర్రపు డెక్క మొలిచింది. రామసాగరం క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. ప్రకృతి సౌందర్యమైన రామసాగరం పర్లాకిమిడి మహారాజా కాలం నాటిది. గజపతి, కృష్ణసాగరాల నుంచి నేరుగా కాలువల ద్వారా రామసాగరం, సీతాసాగరం గొలుసుకట్టుగా అప్పట్లో నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వాలు వాటి నిర్వహణను అశ్రద్ధ చేయడంతో ఆక్రమణలకు గురై, మట్టి పేరుకుపోయింది. రామసాగరం చుట్టు రింగురోడ్డు నిర్మించి, బోటింగ్‌ పార్కుగా నిర్మించడానికి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి చిన్ననీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు ఆశిష్‌ మల్లిక్‌కు డి.పీ.ఆర్‌.లు ఇవ్వాలని కోరారు. రామసాగరం సుందరీకరణకు అంచనాలు రూపొందిస్తే రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. అనంతరం రామసాగరం సుందరీకరణ పనులుపై చిన్ననీటి పారుదల శాఖ అసిస్టెంటు ఇంజినీర్లు మనోజ్‌ చౌదురి, ఇతర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement