విజయన్‌ నివాసంపై దాడులు దారుణం | - | Sakshi
Sakshi News home page

విజయన్‌ నివాసంపై దాడులు దారుణం

May 29 2026 2:31 AM | Updated on May 29 2026 2:31 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కేరళ మాజీ సీఎం, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్‌ నివాసంపై ఈడీ దాడులు చేయడాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ చేతిలో రాజకీయ సాధనంగా ఉన్న ఈడీతో విజయన్‌ను అప్రతిష్ట పాలు చేయాలనే దుర్బుద్ధితో దాడులకు పూనుకుందని విమర్శించారు. రాజకీయ ప్రత్యార్థులను వేటాడేందుకు కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేరళలోనూ అదే కుట్ర చేసిందని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి.సింహాచలం, పోలాకి ప్రసాద్‌, సీహెచ్‌ అమ్మన్నాయుడు, అల్లు సత్యనారాయణ, ఎస్‌.సూరీడమ్మ, కొత్తకోట అప్పారావు, ఎం.గోవర్దన్‌రావు, ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సోమశేఖర్‌, బూర్లు సింహాచలం, ఎం.గణేష్‌,

ఆర్‌.ప్రకాష్‌, ఎస్‌.నగేష్‌, జానీ, జ్యోతేశ్వరరావు, వాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత పెద్దపాడు

గార: తాళ్లవలస గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన అసిరితల్లి జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా ‘పెద్దపాడు’ జట్టు నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్స్‌లో శ్రీకూర్మం జట్టుపై విజయం సాధించింది. 12 రోజులుగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం 42 జట్లు పాల్గొనగా, మ్యాచ్‌లన్నీ హోరాహోరీగా జరిగాయి. విజేతలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల గార జోనల్‌ కన్వీనర్‌ బి.సింహాచలం మాస్టారు, బీసీవై పార్టీ అధ్యక్షుడు పానిని ప్రసాద్‌ చేతుల మీదుగా ట్రోఫీ, రూ.25 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా దుంగ శ్రీను ఎంపికయ్యాడు. కార్యక్రమంలో టి.పమిడయ్య, కె.జగ్గారావు, కె.శేఖర్‌, కె.రాజారా వు, టి.లచ్చన్న, కలగ ఢిల్లీశ్వరరావు, కరగాన రమణ, నిర్వాహకులు టి.గణ, ఎస్‌.శ్రీను, ఏ.దుర్గాప్రసాద్‌, గ్రామ యువత పాల్గొన్నారు.

నేరేడు ఫలం..

పోషకాలు పుష్కలం

శ్రీకాకుళం కల్చరల్‌ : మార్కెట్‌లో నేరేడు పండ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ఈ సీజన్‌లో లభించే అద్భుతమైన ఆరోగ్యకరమైన పండు కావడంతో కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో సహాయపడటంలో నేరేడు పండు ముందంజలో ఉంటోంది.

ఇవీ ప్రయోజనాలు..

నేరేడు పండు మధుమేహ నియంత్రణలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జంబోలిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్‌ బాధితులకు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం, విరేచనాలు వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. విటమిన్‌–సి, ఐరన్‌ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ కౌంట్‌ పెరిగి రక్తహీనత తగ్గుతుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అయితే, నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు.పాలు తాగిన వెంటనే వీటిని తీసుకోవడం మంచిది కాదు.

Advertisement
 
Advertisement
Advertisement