● తప్పిన పెను ప్రమాదం
● రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దు
భువనేశ్వర్: సరుకు రవాణా రైళ్లపై క్రేన్ కూలిపోయింది. బాలాసోర్ జిల్లా నీలగిరి సమీపంలో గోపినాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో గురు వారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అన్ లోడింగ్ పనులు జరుగుతుండగా 2 గూడ్స్ రైళ్లపై క్రేన్ కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఆ ప్రాంతంలో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం రైల్వే స్టేషన్ సమీపంలోని స్లీపర్ల తయారీ యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే స్లీపర్లను ఎక్కించడానికి, దించడానికి ఉపయోగిస్తున్న క్రేన్, పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా కూలిపోయి, నిలిచి ఉన్న రెండు గూడ్స్ రైళ్లపై నేరుగా పడింది. క్రేన్ కూలిన ధాటికి రైల్వే ట్రాక్‌కు అనుసంధానించబడిన ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో ఘటనా ప్రాంతంలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ప్రయాణికుల రైళ్ల కార్యకలాపాలను నిలిపివేశారు. రైల్వే అధికారులు, సాంకేతిక బందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ, మరమ్మతు పనులను ప్రారంభించారు.


