ఎవరైతే మాకేంటి..?
● విశాఖ రేంజి ఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా పోలీస్ యంత్రాంగం యావత్తు ఇచ్ఛాపురంలో ‘మాదకద్రవ్యాలు రూపుమాపడంపై అభ్యుదయ సైకిల్ ముగింపు యాత్ర’ కార్యక్రమం భారీ ఎత్తున జరిపారు. జరిగి కొన్ని గంటలైనా కాలేదు.. ఆ కార్యక్రమానికి హాజరై వస్తున్న ఎస్‌ఐ డి.లోవరాజు, మరో కానిస్టేబుల్ సోంపేటలోని జామి ఎల్లమ్మ దేవాలయం సమీపానికి వచ్చేసరికి ముగ్గురు (వీరిలో యువకులు,బాలురు ఉన్నారు) గంజాయి మత్తులో గొడవపడుతున్నారు. గొడవెందుకుని ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఆపడంతో చేతులతో దాడికి ఎగబడ్డారు. ఇదే అంశంలో ఎస్‌ఐని వీఆర్‌పై బదిలీ చేశారు.
● ఇదే సోంపేటలో మత్తులో ఇద్దరు యువకులు ఇంట్లో గొడవ చేస్తుండటంతో కుటుంబీకులే పోలీసులకు సమాచారమిచ్చారు. వారిని తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తోసేయడం.. ఆ తర్వాత ఓ దుకాణాదారునిపై యువకులు దాడి చేస్తుండగా అక్కడే ఉన్న ఏఎస్‌ఐ సింహాద్రి, కానిస్టేబుళ్లు విజయ్, మురళీలు ప్రేక్షక పాత్ర పోషించారు. సోషల్‌మీడియాలో సంబంధిత వీడియోలు వైరల్ కావడంతో పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు.
● ఈ ఏడాది జనవరిలో జిల్లాకేంద్రంలో ఇద్దరు యువకులపై మరో ముగ్గురు యువకులు మద్యం, గంజాయి మత్తులోనే దాడి చేసి గాయపర్చారని స్థానికులు ఆరోపించారు. కుటుంబం మధ్య జరిగిన వ్యక్తిగత గొడవగా పోలీసులు పేర్కొన్నారు.
● జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏఎస్‌ఐ రాత్రి వేళ విధులు ముగించుకుని దమ్మలవీధివైపు వస్తుండగా యువత మత్తులో న్యూసెన్సు చేస్తూ బండిని ఆపడంతో.. ఎందుకు ఆపారని ఏఎస్‌ఐ అన్నందుకు ఆయనపై దాడి చేశారు.
దాడులు ఈ మత్తులోనేనా..?
జిల్లాలో కొన్ని దాడులు.. హత్యలు జరిగే విధానాన్ని బట్టి స్థానికులు గంజాయి మత్తులోనే జరిగాయని, ఆరోపణలు ఎదుర్కొన్నవారు గంజాయి అతిగా వాడినవారు కావడంతో ఆ మత్తులోనే దాడులు, హత్యలు చేసి వుంటారని వ్యాఖ్యానించడం గమనార్హం. పోలీసులు మాత్రం మద్యం మత్తులోనే జరిగాయని కేసులను ముగించేయడం విశేషం.
● పాతపట్నంలో పోలీసులకు గంజాయి డెన్‌ల సమాచారాన్ని ఇచ్చిన ఓ వ్యక్తిని బస్సు దిగుతుండగానే అవే గంజాయి బ్యాచ్‌లు దాడి చేశాయి.
సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్న పోలీసులే నేరస్థులకు ఉప్పందించడంతోనే ఇలా జరిగిందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
● నరసన్నపేట కేంద్రంగా చేసుకుని ఓ వ్యాపారిపై ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దాడికి ఎగబడ్డారు.
● జిల్లాకేంద్రంలోని టీడీపీ కార్యాలయానికి చెందిన వ్యక్తి రాత్రి సమయాన మహలక్ష్మినగర్‌వైపు వెళ్తూ తన మేనల్లుడు మత్తు బ్యాచ్‌తో వుండటం చూశాడు. వారితో ఎందుకున్నావ్ అన్నందుకు అందులో మత్తులో ఉన్న ఓ వ్యక్తి బండిపై నున్న టీడీపీ వ్యక్తిని తోసేయడంతో తలకు బలమైన గాయమై మృత్యువాత పడ్డాడు.
● జిల్లాకేంద్రంలోని ఓ వివాహితను మద్యం మత్తులో రూమ్‌కు పిలిపించుకున్న యువకుడు చంపాడని పోలీసులు నిర్ధారించారు. కాగా యువకుడు మూడు రోజులుగా మత్తు వీడకపోవడం గంజాయి సేవించే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో లేనంతగా మేం గంజాయిని పట్టుకుంటున్నాం.. లెక్కలేనన్ని కేసులు నమోదు చేస్తున్నాం.. భారీగా గంజాయిని సీజ్ చేస్తున్నాం. సరఫరా, క్రయ, విక్రయదారులను జైళ్లకు పంపిస్తున్నాం.. ఆస్తులను జప్తు చేస్తున్నాం.. అడిక్షన్ సెంటర్లకు సేవించేవారిని పంపిస్తున్నాం..ఇవీ పోలీసులతో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టిస్తున్న మాటలు. ఇన్ని చేస్తున్నా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఇప్పటికీ ఎందుకు అరికట్టలేకపోతున్నారు..? చెక్‌పోస్టులు, సరిహద్దులు దాటి రైళ్లు, బస్సులు, టూవీలర్లు, ఇతర వాహనాల ద్వారా అంతర్రాష్ట్ర గంజాయి సరఫరాదారులు ఎలా చొరబడుతున్నారు..? అనే ప్రశ్నలకు సమాధానం కరువైపోతుంది. ఇటీవల కొత్తగా డ్రగ్ డిటెక్షన్ కిట్లను జిల్లావ్యాప్తంగా ఉన్న పీఎస్‌లకు ఎస్పీ పంపించారు. మూత్ర పరీక్షలు ఆధారంగా నిమిషాల్లో గంజాయి, ఇతర మత్తుపదార్థాల సేవించేవారిని గుర్తించే ఈ కిట్ల ద్వారా శ్రీకాకుళం సబ్ డివిజన్‌లో ఒక్క రోజే 30 మంది అనుమానితులు పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్ధం చేసుకోవచ్చు.


