● స్మార్ట్‌గా సెల్‌ఫోన్లు దోచేస్తారు
● అంతేవేగంగా రాష్ట్రాలు దాటి మళ్లిస్తారు
● రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లే వీరి టార్గెట్
శ్రీకాకుళం క్రైమ్:
ప్రస్తుత కాలంలో అందరి చేతుల్లో నూ స్మార్ట్‌ఫోన్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సెల్‌ఫోన్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు రూ.10 వేల నుంచి రూ.లక్షల్లో ధర ఉండే ఫోన్లు వాడుతున్నారు. అయితే అలాంటి స్మార్ట్‌ఫోన్లను కొందరు కేడీగాళ్లు అంతే స్మార్ట్‌గా దోచేస్తున్నారు. అనంతరం వాటిని రాష్ట్రాలు దాటించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారంటే నమ్మడం అతిశయోక్తి కాదు.
ఈ గ్యాంగుల పనే..!
కృష్ణా జిల్లా అకివీడు, రాజమండ్రి గోకవరం, విజ యనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మూడు గ్యాంగులు స్మార్ట్‌ఫోన్లను దర్జాగా కొట్టేసి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో గ్యాంగులో 10 నుంచి 15 మంది సభ్యులుంటారు. ఇటీవలే విశాఖ రేంజి పరిధి పోలీసులకు పట్టుబడినట్లే పట్టుబడి జారిపోయారు. బ్యాక్‌డ్రాప్‌లో బడా సూత్రదారులుండడం.. ఎవరైనా కేసు నమోదు చేస్తే వారిపైనే హెబియస్ కార్పస్ అనే వజ్రాయుధంతో హై కోర్టులో రిట్ వేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
మైనర్లతో నేరాలు
ఈ గ్యాంగ్‌లు మైనర్ బాలలను ఎక్కువగా వాడుకు ని రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్రయాణికుల మొబైల్స్‌ను టార్గెట్ చేస్తారు. ఒక్కో బాలుడికి రోజుకు రూ.300లు ఇస్తారు. ఏరియాను బట్టి రోజుకు 40 నుంచి 70 మొబైల్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుంటారు. పోగొట్టుకున్న, దొంగిలించిన సెల్‌ఫోన్లను కారు డిక్కీల్లో, సైడ్ డోర్లలో ప్రత్యేకంగా ప్యాక్ అయ్యేలా సెటప్ చేసుకుంటారు. ఈ విధంగానే దాదాపు 50 వరకు ఫోన్లను రేంజి పరిధి పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. నెలకు వీరికి టర్నోవర్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. విశాఖ, అనకాపల్లి, తుని, ఒడిశా బరంపురంల్లో ఎక్కువగా చోరీలు చేస్తున్నట్లు సమాచారం. దొంగిలించే ఈ మొబైళ్లను హైదరాబాద్ సెకెండ్ హ్యాండ్ ఫోన్లు సేల్స్ చేసే చోరీ బజార్, చైన్నెలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.


