కాల్పుల కలకలం | - | Sakshi
Sakshi News home page

కాల్పుల కలకలం

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

● భువనేశ్వర్‌లో పోలీసుల మెరుపు దాడి ● డ్రగ్‌ మాఫియా డాన్‌కు తీవ్ర గాయాలు

భువనేశ్వర్‌: స్థానిక ఇన్‌ఫో వ్యాలీ పోలీస్‌ ఠాణా పరిధి సమీపంలో బుధవారం కాల్పులు కలకలం రేగింది. గంజాం జిల్లా జగన్నాథ్‌ ప్రసాద్‌ ప్రాంతానికి చెందిన పేరు మోసిన మాదకద్రవ్యాల స్మగ్లర్‌ పపున్‌ మాఝీపై కమిషనరేట్‌ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డ్రగ్‌ వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఇన్‌ఫో వ్యాలీ పోలీస్‌ ఠాణా పరిధిలోని అరిసోల్‌ సమీపంలో పపున్‌ ఉన్నాడనే విశ్వసనీయ సమాచారం అందడంతో కమిషనరేట్‌ పోలీసులు స్పెషల్‌ క్రైం యూనిట్‌ మెరుపు దాడి నిర్వహించింది. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. వీరి రాకను గమనించిన పపున్‌ అక్కడి నుంచి పారిపోవడానికి విఫలయత్నం చేశాడు. అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతడు మొదట పోలీసు బృందంపై ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో పపున్‌ మాఝీ కుడి కాలికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని చికిత్స కోసం మొదట భువనేశ్వర్‌లోని క్యాపిటల్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్య సంరక్షణ కోసం కటక్‌లోని ఎస్‌ిసీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చేర్పించారు.

పోలీసుల ఆరా..

భువనేశ్వర్‌, పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లో పపున్‌ ప్రమేయం ఏ మేరకు ఉందో నిర్ధారించే దిశలో దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. అంతర్‌ రాష్ట్ర డ్రగ్‌ సిండికేట్‌లు, ఇతర నేర సహచరులతో అతనికి ఉన్న సంబంధాలపైనా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉన్నతాధికారులు దర్యాప్తును నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి లక్షలాది రూపాయల విలువైన డ్రగ్స్‌, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతున్న కొద్దీ నిందితుడి నేర చరిత్ర, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, నిషేధిత వస్తువుల గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement