మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి యం.వి.66 గ్రామంలో బుధవారం కలిమెల పోలీసులు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రాకు చెందిన నగేష్ సిరుగురు ఇక్కడ నుంచి గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఐఐసీ ప్రభుదత్తు విశ్వల్ ఆదేశాలతో ఎస్సై విష్ణు ప్రసాద్ శబర్ నేతృత్వంలోని బృందం గంజాయి ఉంచిన ప్రాంతానికి వెళ్లి దాడి చేశారు. అక్కడ నుంచి సరిగేట గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో గంజాయి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నగేష్ సిరుగురు పరారైయ్యాడు. బస్తాల్లో ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని స్టేషన్‌కు తరలించారు. ఐఐసీ ప్రభుదత్తు సమీక్షంలో తూకం వేయగా 650 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో దీనివలువ రూ. 75 లక్షలు ఉంటుందన్నారు. కేసునమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నగేష్ కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలంలో నిందితులకు చెందిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.


