ఎస్పీ రాజ్‌ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ రాజ్‌ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

రాయగడ: రాయగడ జిల్లా ఎస్పీగా నియమితులైన రాజ్‌ప్రసాద్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న స్వాతి ఎస్‌ కుమార్‌ నుంచి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని అన్నారు. చట్ట వ్యవస్థను మరింత పటష్టం చేయడంపై దృష్టిసారిస్తానని వివరించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పెట్రోలింగ్‌ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహించడం, రాయగడ పట్టణంలో సీసీ కెమెరాల వ్యవస్థ పునరుద్ధరించడం, సైబర్‌ నేరాల శాతాన్ని తగ్గించడం, ట్రాఫిక్‌ నియమాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు. అలాగే ఆర్మ్స్‌ యాక్ట్‌ కు సంబంధించిన కేసులను కూడా అత్యంత ప్రాధాన్యంతో తీసుకుంటామని ఎస్పీ అన్నారు. నేరస్తుల వద్దకు తుపాకీలు, పిస్తోళ్లు వంటి ఆయుధాలు ఎలా చేరుతున్నాయి.. వాటి మూలాలను గుర్తించి వాటిని నియంత్రించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలకు చేరువయ్యే పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేయడం, ప్రజలు–పోలీసులు మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచడం ద్వారా పురక్షిత వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని రాజ్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రజల సహకారంతో నేరాలను నియంత్రించి జిల్లాను మరింత భద్రతతో కూడిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇదిలాఉండగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణితో కలసి రాయగడ ప్రజల ఆరాధ్య దైవం మజ్జిగౌరీ అమ్మవారిని రాజ్‌ప్రసాద్‌ దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా మందిరం కమిటీ సభ్యులు ఇప్పలి సన్యాసిరాజు, దేవేంద్ర బెహరలు ఎస్‌పి ప్రసాద్‌ కు అమ్మవారి ఫొటోను అందించి సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement