పర్లాకిమిడి: రాయఘడ బ్లాక్ కోరడాసింగి గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ వందనారాణి నాయక్ ప్రథమ ప్రయత్నంలోనే ఒడిశా అడ్మిన్‌స్ట్రేటీవ్ సర్వీస్ (ఓఏఎస్) పరీక్షలో 190వ ర్యాంకుతో ఉద్యోగం సాధించింది. వందనారాణి నాయక్ తండ్రి నటవర్ నాయక్, తల్లి రాధామణి నాయక్ మధ్యతరగతి చెందిన కుటుంబం. పర్లాకిమిడిలో సరస్వతీ శిశువిద్యామందిర్‌లో చదివి టెన్త్ పరీక్షల్లో ప్రథమం సాధించింది. తరువాత బరంపురం సరస్వతీ శిశు విద్యామందిర్ (నీలకంఠాపురం) ప్లస్‌టు సైన్స్ చదివిన అనంతరం భువనేశ్వర్‌లో రమాదేవి మహిళా కళాశాలలో ఎం.ఎస్పీ (ఫిజిక్స్)లో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణురాలైంది. ఆమె విజయంపట్ల రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, స్పెషల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ కామదేవ్ బోడోనాయక్, కోరడాసింగి గ్రామ ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
పూరీలో టీఎంసీ ఎమ్మెల్యే అరెస్ట్
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే దిలీప్ మండల్‌ను పూరీలోని ఒక హోటల్‌లో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) ఆయనను అరెస్ట్ చేసి పశ్చిమ బెంగాల్‌కు తీసుకువెళ్లింది. దిలీప్ మండల్ మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పని చేశారు.


