భువనేశ్వర్: రుతు పవనాల కదలిక చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో వానా కాలం పరిస్థితుల నిర్వహణ ప్రక్రియ సన్నద్ధతను జల వనరుల విభాగం సమీక్షించింది. ఈ కాలంలో సంభావ్య వరదలు వంటి విపత్కర పరిస్థితుల సమర్థమైన నిర్వహణ, ప్రజల భద్రత నిర్ధారణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శుభా శర్మ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ఇంజినీర్ ఇన్ చీఫ్ ఇంజనీర్ బిభూతి భూషణ్ దాస్ హాజరయ్యారు. సీనియర్ శాఖాధికారులు, అన్ని ప్రధాన ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు వర్చువల్ విధానంలో పాల్గొని వారి అధికార పరిధిలో ప్రస్తుత సన్నద్ధత, వరద నివారణ చర్యల స్థితిపై వివరణాత్మక సమాచారాన్ని అందించారు.
మౌలిక సదుపాయాల నష్ట నివారణ, శూన్య ప్రాణ హాని లక్ష్యంపై సమగ్ర యంత్రాంగం నిబద్ధత, క్షేత్రస్థాయి అధికారులు, ఉప విభాగాలు నిరంతర సమన్వయం, అప్రమత్తత కార్యకలాపాల్ని విశ్లేషించారు. ప్రధానంగా వరద అత్యవసర ప్రణాళిక కార్యాచరణ అమలుపై విస్తృతంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నదుల గట్లు, తీర ప్రాంతాల్లో పటిష్టత తదితర అనుబంధ వ్యవస్థల పటిష్టతని సమీక్షించారు. గత ఏడాది వరదల వల్ల జరిగిన నష్టాలను పరిష్కరించేందుకు జరుగుతున్న పునరుద్ధరణ, మరమ్మతు పనుల ప్రస్తుత స్థితిని ఈ సందర్భంగా విశ్లేషించారు. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు ప్రారంభం అయ్యేలోగా అసంపూర్తిగా ఉన్న అన్ని మరమ్మతు, పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో జల దిగ్బంధ సమస్యలను పరిష్కరించడానికి, నదీ జలాశయాల గేట్ల కార్యాచరణను తనిఖీ, వేగవంతమైన డ్రైనేజీ పూడికతీత పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆనకట్టల వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్స్ నుంచి వెల్లడైన కీలక అంశాల ఆధారంగా వరద గేట్ల కార్యాచరణ, అనుబంధ అధికార యంత్రాంగం సన్నద్ధత స్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. పెరుగుతున్న నీటిమట్టాల నుండి సకాలంలో రక్షణ కల్పించేందుకు ఇసుక బస్తాలు, వెదురు కర్రలు, తీగ జాలీలు వంటి కీలకమైన వరద నివారణ సామగ్రి లభ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందన్నారు. రుతుపవనాల తాకిడితో వానలు తీవ్రం అయి ప్రమాదానికి గురయ్యే సమస్యాత్మక ప్రాంతాలపై రాత్రింబవళ్లు నిరంతర నిఘా, అధునాతన అత్యవసర పరికరాలను తక్షణ సన్నద్ధతతో యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండేదుకు మార్గదర్శకాలు జారీ చేశారు.జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు, అన్ని డివిజన్, సర్కిల్, చీఫ్ ఇంజినీర్ కార్యాలయ స్థాయిలలో రాత్రింబవళ్లు పని చేసే ప్రత్యేక వరద నియంత్రణ గదులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఏకకాల వరద సెల్‌లు
వ్యవసాయ సదన్, రాజీవ్ భవన్ రాష్ట్ర హైడ్రోలాజికల్ డేటా సెంటర్‌లో జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఏకకాలంలో వరద సెల్ నిరంతరాయంగా పని చేస్తాయి.
నదులు, జలాశయాల అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నీటి మట్టం పరిశీలన తదితర విపత్తు నిర్వహణ కార్యకలాపాలు పురస్కరించుకుని పటిష్టమైన సమన్వయం కీలకంగా పరిగణించి నిరంతరాయ సమాచార మార్పిడితో సమయోచిత కార్యాచరణ కొనసాగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.


