పర్లాకిమిడి: యోగాతో మానసిక ప్రశాంతంత చేకూరడంతోపాటు మెరుగైన ఆరోగ్యం సాధ్యమని వక్తలు అన్నారు. జూన్ ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీక్రిష్ణచంద్రగజపతి కళాశాల గౌరచంద్రగజపతి రంగస్థల వేదికపై పతంజలి యోగా సమితి గజపతి జిల్లా ప్రభారి విఘ్ణేశ్వర దాస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని రెండు నెలలుగా జరుపుతున్నారు. జిల్లాలోని గజపతి స్టేడియం, వివిధ కళాశాలలు, కాశీనగర్, గుమ్మ, గుసాని, చంద్రగిరి, నువాగడ సమితిల్లో పతంజలి యోగి సమితి, భారత్ శ్వాభిమాన్ సంఘటన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక స్థలాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు విఘ్నేశ్వర్ దాస్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యోగా ద్వారా ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక రుగ్మతల నుంచి లబ్ధిపొందడమే కాకుండా మన నిత్యజీవితంలో ఉల్లాసంగా, దైనందిన కార్యాలు నెరవేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఇదొక ప్రాచీన విద్యఅని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాల విద్యార్థులు, ఐటీ ఇంజినీర్లు పనిఒత్తిడి వల్ల డిప్రెషన్‌కు లోనయ్యి మత్తు పదార్థలకు లోనవుతున్నారని, అలాంటి వారికి కూడా యోగా థెరపీ వల్ల జబ్బులు నయమవుతున్నట్టు యోగా గురువు దాస్ తెలిపారు. శిబిరంలో యువతీ యువకులతో పాటు వయో వృద్ధులు కూడా చేరి కోర్సులు పూర్తిచేసి ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం రెండు నెలలుగా కొనసాగిస్తున్న యోగాభ్యాస్యాలలో ఆరితేరిన యోగా గురువులుగా తయారుచేసి జిల్లా అంతటా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పంపించే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.


