రాయగడ రైల్వే డీసీ కార్యాలయం సందర్శన | - | Sakshi
Sakshi News home page

రాయగడ రైల్వే డీసీ కార్యాలయం సందర్శన

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

రాయగడ: రైల్వే కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భావించే రాయగడ డివిజనల్‌ కంట్రోల్‌ కార్యాలయాన్ని వాల్తేర్‌ డివిజనల్‌ మేనేజర్లు లలిత్‌ బొహ్ర రాయగడ డివిజనల్‌ మేనేజరు అమితాబ్‌ సింఘాల్‌తో కలిసి మంగళవారం సమగ్రంగా పరిశీలించారు. ప్రధానంగా రాయగడ కంట్రోల్‌ కార్యాలయ కార్యకలాపాల పురోగతి, నిర్వహణ సామర్ధ్యం, సిబ్బంది సన్నద్ధత తదితర అంశాలను సమీక్షించారు. డివిజన్‌లో కంట్రొల్‌ కార్యాలయం అత్యంత కీలకమైన నాడీ కేంద్రంగా పనిచేస్తుందని డీఆర్‌ఎంలు పేర్కొన్నారు. పరిశీలన సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రాయగడ కంట్రోల్‌ కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును డీఆర్‌ఎంలు సమీక్షించారు. ముఖ్యంగా ఆపరేషన్స్‌, ఇంజినీరింగ్‌, క్యారేజ్‌ అండ్‌ వేగన్‌, భద్రత, క్రూ మేనేజ్‌మెంట్‌ తదితర శాఖల కార్యకలాపాలపై అధికారులు వివరాలు అందించారు. అలాగే రైల్వే కంట్రోల్‌ సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వాటి పనితీరుపై ఆరాతీశారు. అంతకు ముందు వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎం అలిత్‌ భొహ్ర విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు విండో ట్రైలింగ్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి పనులు, భద్రత ఏర్పాట్లు, ప్రయాణికుల సౌకర్యాల అభివృద్ధి పనులను పరిశీలించారు. సిగ్నలింగ్‌ వ్యవస్థ, రైల్వే పాయింట్లు, క్రాసింగ్‌లు, యార్డ్‌ నిర్మాణం పనుల పురోగతిని అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. రైల్వే భద్రత, కార్యాచరణ సామర్ధ్యం, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచి రైళ్ల రాకపోకలు సజావుగా జరిగేలా చూడడమే తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement