జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన 15 వ ఒడిశా బెటాలియన్ ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎన్‌సీసీ కేడెట్స్ పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి, ముగింపు ఉత్సవానికి వన్నె తెచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విక్రమదేవ్ యూనివర్సిటీ రిజిస్టార్ మహేశ్వర చంధ్ర నాయిక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేడెట్స్ క్రమశిక్షణ అలవర్చుకొని దేశభక్తి, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఉద్బోధించారు. కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో మాట్లాడుతూ వార్షికోత్సవంలో ఎన్‌సీసీ కేడెట్స్ శారీరక, మానసిక, నైతిక శిక్షణ పొంది తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకున్నారని తెలిపారు. ముగింపు ఉత్సవంలో కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కర్నల్ ప్రీతిరంజన్ దాస్ మాట్లాడుతూ వార్షికోత్సవంలో కేడెట్స్ క్రమశిక్షణ, కృషి, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న తీరు ప్రశంసనీమయని కొనియాడారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు కేడెట్ల మనసులో దేశ సేవా భావణ కలిగించటంతో పాటు, వారిని భవిష్యత్‌లో బాధ్యతాయుత పౌరులుగా తీర్చి దిద్దుతాయని అన్నారు.


