రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధి పొలమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు మరోసారి సత్తాచాటారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరిగిన జాతీయ ఉపకనిష్ట త్రోబాల్ పోటీల్లో విద్యార్థినులు నికితా మండిక, స్వప్న హుయిక, మౌసుమి మాఝిలు అద్భుత ప్రతిభ కనబర్చి కాంస్య పథకాన్ని సాఽధించారు. దీంతో వీరిని పలువురు అభినందించారు. మంగళవారం రాయగడ చేరుకున్న వీరికి క్రీడాభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
ఏనుగు సంచారం
రాయగడ: గత కొన్నేళ్లుగా ఏనుగుల సంచారంతో భయాందోళనకు గురవుతున్న బిసంకటక్ సమితి రెటేలి గ్రామంలో, తాజాగా ఒక ఏనుగు చెరువు వద్ద స్నానం చేస్తుండడం కనిపించడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. సమీప అడవుల నుంచి వేసవి తీవ్రత కారణంగా ఉపశమనం పొందేందుకు చెరువు వద్దకు ఏనుగు వచ్చి గంటల పాటు చెరువులో ఉంది. అయితే ఈ ఏనుగు ఎప్పుడు ఎటువంటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందోనన్న భయాన్ని ఆ ప్రాంత వాసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కటే ఏనుగు ఉందా లేకుంటే గుంపుగా ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు.
పేకాట శిబిరంపై దాడి
మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి జియటిపల్లి గ్రామ సమీప అడవిలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు మంగళవారం సమాచారం వచ్చింది. దీంతో కోరుకొండ పోలీసులు పేకాట శిబిరంపై దాడిచేసి ముగ్గురుని అరెస్టు చేశారు. అలాగే 9 ద్విచక్ర వాహనాలు, రూ.440ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్నవారిని గాలిస్తున్నట్లు ఐఐసీ విజయ్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం నిందితులను కోర్టుకు తరలిస్తామన్నారు.
సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఆరుగురి మృతి
భువనేశ్వర్: కలహండి జిల్లా ఎం.రాంపూర్ (మదన్‌పూర్ రాంపూర్) పోలీస్ ఠాణా పరిధిలోని గౌడ్ కర్లఖుంట గ్రామంలో మంగళవారం ఉదయం సెప్టిక్ ట్యాంక్ పనుల్లో ఊపిరాడక 6 మంది మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సెప్టిక్ ట్యాంక్‌లోని వ్యర్థాలను తొలగించడానికి కార్మికుడు లోపలికి ప్రవేశించాడు. కాసేపటి తర్వాత అతడి అలికిడి లేకపోవడంతో పరిశీలించి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నట్లు గుర్తించారు. అతడిని రక్షించేందుకు తోటి కార్మికులు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు. వారంతా దురదృష్టవశాత్తు స్పృహ కోల్పోయారు. బాధిత వర్గాల కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో స్థానిక యంత్రాంగం గ్రామస్థుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టింది. సెప్టిక్ ట్యాంక్ లో చిక్కుకున్న బాధితులందరినీ బయటకు తీశారు. వారిని వెంటనే చికిత్స కోసం మదన్‌పూర్ రాంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారిలో ఆరుగురు ఊపిరాడక మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో తండ్రి మహేశ్వర్ హతి (62) మరియు అతడి ఏకై క కుమారుడు రంజన్ హతి (27) ఉన్నారు. ఈ దుర్ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.


