మహేంద్రగిరి మేళాకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

మహేంద్రగిరి మేళాకు ఏర్పాట్లు

May 27 2026 12:53 AM | Updated on May 27 2026 12:53 AM

పర్లాకిమిడి: మహేంద్రగిరిపై జూన్‌ 1 నుంచి 9 వరకూ మహేంద్రమేళాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని కోసం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి బిభూతి భూషణ్‌ జెన్నా రెండురోజులుగా అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే యాత్రికులు, సాధుసంతువులు కోసం గుడారాలు, భోజన సదుపాయాలు, యజ్ఞాదులు కోసం తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 1500 మంది కోసం విడిది, వేలాది మంది సాధు సంతువులు కంధమాల్‌, కోరాపుట్‌, గంజాం, ఫుల్బనీ, రాయగడ జిల్లాల నుంచి విచ్చేసే వారికి విడిది సౌకర్యాలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే మహేంద్రం వచ్చే భక్తులు, యాత్రికులు కోసం తాగునీరు, విద్యుత్‌, భోజన సదుపాయాలకు మహేంద్రంలో తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ జ్యేష్ట మాసంలో అధిక మాసం పడటం మూలాన, యమునా నదికి పుష్కరాలు పడటం, శుభసూచకమని చాలా ఏళ్ల తరువాత పవిత్ర పురుషోత్తమాసం జేష్టంలో సంభవించటంతో మహేంద్రంలో తొలిసారిగా మహేంద్రమేళాను గజపతి జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్నది. జూన్‌ 5, 9 తేదీల్లో మహేంద్రగిరి కుండ్‌ వద్ద పవిత్ర స్నానాలు ఉంటాయని మంత్రి బిభూతిభూషన్‌ జెన్నా విలేకరులకు తెలిపారు. ప్రతి ఒక్కరూ వచ్చి పరశురాం కుండ్‌ వద్ద యజ్ఞయాగాదులు చూసి తరించాలని మంత్రి జెన్నా కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement