రాయగడ: ఝార్సుగుడ ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర ఆదేశానుసారం సరిహద్దు ప్రాంతమైన చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న క్రమ నాటుసారా తయారీ, రవాణా వ్యవస్థలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెంగాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా సరిహద్దులో అక్రమ నాటు సారా తయారీ, రవాణా జరుగుతుందని సమాచారం మేరకు పోలీసులు మంగళవారం ఈ దాడులను నిర్వహించారు. హిరాఖుడ్ జలాశయం బ్యాక్ వాటర్స్ ప్రాంతంతో పాటు ఒడిశా–చత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ స్థాయిలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో అదనపు ఎస్‌పి, ఐయూసీఏడబ్ల్యూ, డీఎస్పీ లఖన్‌పూర్ ఐఐసి, రెంగాలి ఓఐఈలతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. మూడు ప్లాటూన్ల పోలీస్ బలగాలు, మహిళ పోలీస్ సిబ్బంది కూడా ఈ దాడుల్లో పాల్గొని ఆయా ప్రాంతాల్లొ గల ఇళ్లలో తనిఖీలు, కూంబింగ్ చర్యలు చేపట్టారు. అక్రమంగా నాటుసారా తయారీ చేసే సుమారు 17 నాటుసారా బట్టీలను కూల్చివేసి ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో 870 లీటర్ల నాటుసారాతో పాటు తయారీకి వినియోగించే సామగ్రి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాఘవేంద్ర విలేకర్లకు తెలియజేశారు.


