● కొలిక్కి వచ్చిన పల్లెగుడ హత్య కేసు
జయపురం: జయపురం సమితి పల్లెగుడ గ్రామంలో ఇటీవల జరిగిన ఒక మహిళా హత్య కేసుని ఎట్టకేలకు ఛేదించారు. హంతకుడు ఆమె భర్తేనని పోలీసులు నిర్ధారించారు. పోలీసుల వివరణ ప్రకారం పల్లెగుడ గ్రామంలో బిభీషణ భూమియ భార్య కమల భూమియ స్నానం చేసిన సమయంలో బట్టలు లేకుండా ఉందని ఆగ్రహించిన ఆమె భర్త గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు. నిందితుని అరెస్టు చేసి హత్యకు అతడు వినియోగించిన గొడ్డలి సీజ్ చేసినట్లు పెలీసు అధికారి వెల్లడించారు. అతడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారు బెయిల్ నిరాకరించటంతో జైలుకు పంపించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. పల్లిగుడ గ్రామంలో బిభీషన్ భూమియ తన భార్యతో ఉంటున్నాడు. ఈ నెల 23 వ తేదీన గ్రామంలో ఒక ఫంక్షన్ జరుగుతోంది. అది పూర్తయిన తరువాత కమల స్నానం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె దుస్తులు జారిపోయాయి. అది చూసిన బిభీషణ కోపంతో గొడ్డలితో భార్యను కొట్టి కొట్టి గాయపరచాడు. దాంతో కమల పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. అయినా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. 24 వ తేదీ ఉదయం కమల మరణించింది. కమల మరణించిన సమాచారం తెలిసిన ఆమె బంధువులు ఆ రోజు మధ్యాహ్నం పల్లెగుడకు చేరుకున్నారు. కమల నోటి నుంచి రక్తం కారుతుండటం, శరీరంపై దెబ్బలు కనిపించటంతో వారు పోలీసులకు తెలియజేశారు. కమలను కొట్టి చంపాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారి సచేంధ్ర ప్రధాన్, సబ్‌ఇన్‌స్పెక్టర్ శిరీష్ మహాపాత్రో, అమయ రంజన్ సాగరియ, ఏఎస్‌ఐ ప్రశాంత కుమార్ సర్కార్ పోలీసులతో కలసి ఆ గ్రామం చేరుకున్నారు. కొరాపుట్ నుంచి సైంటిఫిక్ టీమ్‌ను రప్పించారు. సైంటిఫిక్ టీమ్ పరీక్షలు జరిపి ఆధారాలు సేకరించారు. పోలీసుల ఎదుట నిందితుడు నేరాన్ని అంగీకరించటంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు.


