బాధితుడిని చావగొట్టిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

బాధితుడిని చావగొట్టిన పోలీసులు

May 27 2026 12:53 AM | Updated on May 27 2026 12:53 AM

భువనేశ్వర్‌: బారంగ్‌ పోలీస్‌ ఠాణా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భార్య గల్లంతు విషయమై ఠాణాకు పిలిపించిన బాధితుని విచారణ చేపట్టాల్సిన పోలీసులు లాఠీ ఝులిపించి చావగొట్టారు. ఈ ఆరోపణతో బాధితుని తండ్రి కార్తీక్‌ బెహరా, తల్లి లక్ష్మీప్రియ బెహరాతో కలిసి బంధు మిత్రులు గ్రామం నుంచి తరలి వచ్చి ఠాణా ముట్టడించారు. పోలీస్‌ ఠాణాలో రాకేష్‌ తల్లి కన్నీళ్లతో పదేపదే స్పృహ కోల్పోయింది. కట్టలు తెంచుకొన్న గ్రామస్తుల ఆగ్రహం దృష్ట్యా బారంగ్‌ పోలీస్‌ ఠాణాకు భద్రత కల్పించేందుకు భారీ బలగాలను మోహరించారు. పోలీసుల దెబ్బలతో తీవ్రంగా గాయపడిన రాకేష్‌ బెహరా (31) కటక్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామస్తులు, బంధువుల ఫిర్యాదుల ప్రకారం రాకేష్‌ బెహరా భార్య ఈ నెల 15వ తేదీన అదృశ్యమైంది. మర్నాడు 16వ తేదీన భార్య అదృశ్యంపై రాకేష్‌ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 22వ తేదీన పట్టొపూర్‌ సమీపంలోని కఠొజొడి నది ఒడ్డున ఇసుకలో పూడ్చిపెట్టిన మహిళ మృత దేహం లభ్యమైంది.

మృత దేహాన్ని గుర్తించడం కోసం పోలీసులు రాకేష్‌ను ఠాణాకు పిలిచారు. ఆ మృత దేహం తన భార్యది కాదని, దొరికిన చీర, గాజులు తన భార్యవి కావని అతను పోలీసులకు పదేపదే మొర పెట్టుకున్నాడు. అది తన భార్య మృత దేహమని అతను అంగీకరించకపోవడంతో పోలీసులు అతడిని కొట్టి తీవ్రంగా గాయపరిచారని గ్రామస్తులు ఆరోపించారు. మరోవైపు పోలీసులు గ్రామస్తుల ఆరోపణలు నిరాధారమైనవని తోసిపుచ్చారు. రాకేష్‌ను పోలీస్‌ స్టేషనుకు పిలిచి విచారణ అనంతరం విడుదల చేసినట్లు వివరించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ఉందని పేర్కొన్నారు. రాకేష్‌ వేరే ఘటనలో గాయపడి ఉంటాడని సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సంఘలనలకు పోలీసులకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement