భువనేశ్వర్: జట్నీ పిత్తాపల్లి ప్రాంతంలోని జీడి తోటలో రక్తసిక్తమైన యువకుడి మృత దేహం లభించింది. స్థానిక ఇన్‌ఫో వ్యాలీ పోలీస్ ఠాణా అధికారులు మృత దేహం పడి ఉన్న జీడి తోట ప్రాంగణం ప్రత్యక్షంగా సందర్శించి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై హత్య అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన విద్యుత్ కేంద్రం సందర్శన
కొరాపుట్: ప్రమాదం జరిగిన మాచ్‌ఖండ్ జల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క మంగళవారం సందర్శించారు. కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితిలో ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సంయుక్త జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ డిమాండ్ చేశారు. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ప్రమాదం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు ని అధికారులు ఎంపీకి వివరించారు. పర్యటనలో డీసీసీ అధ్యక్షుడు రుపక్ తురుక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోజ్ ఆచార్య ఉన్నారు.


