నలుగురు నిందితులకు ఆరేళ్ల జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

నలుగురు నిందితులకు ఆరేళ్ల జైలు శిక్ష

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

రాయగడ: ఒక హత్య కేసుకు సంబంధించి అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి కీలక తీర్పును వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అలేఖమణి నాయక్‌, అంబికా ఖుర, ఖేత్రమణి నాయక్‌, గొరేక్‌ ఖురాలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. కేసు విచారణ జరిపిన మీదట నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తు తీర్పునిచ్చింది. అదేవిధంగా అదనంగా ఒక్కొక్కరికి రూ.5 వేలు జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో మరో ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుల తరఫున న్యాయవాది ఉమాకాంత్‌ వాదించగా, ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రజత్‌ రంజన్‌ ఖటువా వాదనలు వినిపించారు.

నిఖిల్‌ హత్య కేసులో మరో నలుగురి అరెస్టు

రాయగడ: స్థానిక ఇందిరానగర్‌ ఏడో లైన్‌లో ఈ నెల పదో తేదీన జరిగిన నిఖిల్‌ అనే వ్యక్తి హత్య, కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను తాజాగా అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించిన పోలీసులు తాజాగా అరెస్టు చేసిన నలుగురుతో ఈ సంఖ్య 16కు చేరిందని స్థానిక పోలీసు కార్యాలయం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజాగా అరెస్టయిన నలుగురిలో ముగ్గురుని కర్ణాటకలో అరెస్టు చేశారు. అరెస్టయిన ప్రధాన నిందితుల్లొ చింటు అలియాస్‌ దేవాశీష్‌ బిభొర్‌, పవన్‌ కల్పా, సాగర్‌ కల్పాలు ఉన్నారు. వీరు పోలీసుల కన్నుగప్పి పలు రాష్ట్రాల్లో తలదాచుకుంటూ తిరుగుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నుంచి గోవా మీదుగా కర్ణాటకలోని హుబ్లీ వరకు వెంబడించి చివరకు అరెస్టు చేశారు. అలాగే మరో నిందితుడు అజయ్‌ దేవరపల్లిని ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ కేసుకు సంబంధించి ఉన్న ప్రతీఒక్కరిని అరెస్టు చేస్తామని అందుకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.

చేతబడి నెపంతో మహిళ హత్య

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి సోమానాథపూర్‌ పంచాయతీ సారదాగూఢ గ్రామంలో ఆదివారం ఓ దారుణ ఘటణ చోటు చేసుకుంది. చేతబడి చేస్తుందనే నెపంతో ఓ మహిళను గ్రామస్తులు కొట్టి చంపేశారు. పద్మా నాయక్‌ (50) అనే మహిళ, గ్రామానికి చెందని మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి చేతబడి చేస్తోందనే అనుమానంతో గ్రామస్తులు రాళ్లతో కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పద్మా కుమారుడు గణేష్‌ నాయక్‌ వచ్చి తల్లిని ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ఆమె మృతి చెందింది. వెంటనే గణేష్‌ ఈ విషయంపై బలిమెల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా చిత్రకొండ ఎస్‌డీపీఓ ప్రదోష్‌ ప్రధాన్‌, బలిమెల ఐసి దీరాన్‌ పట్నాయిక్‌ లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోమవారం సైంటిఫిక్‌ బృందం వచ్చి నమూనాలు సేకరించింది.

నైజర్‌ పీహెచ్‌డీ స్కాలర్‌ అనుమానాస్పద మృతి

భువనేశ్వర్‌: ఖుర్ధా జిల్లా జట్నీ ప్రాంతంలో జాతీయ విజ్ఞాన విద్య మరియు పరిశోధన సంస్థ (నైజర్‌)కు చెందిన మొదటి సంవత్సరం పీహెచ్‌డీ విద్యార్థిని సోమవారం తన హాస్టల్‌ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించి కనిపించింది. మృతురాలిని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన శ్రేయా సింగ్‌గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శ్రేయ తన మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని తోటి విద్యార్థులు గమనించారు. చాలా సేపటి వరకు ఆమె మేల్కోకపోవడంతో ఆందోళన చెందిన ఆమె సహచరులు హాస్టల్‌ మరియు విద్యాసంస్థ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరణానికి గల కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి మృత దేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు పంపారు. జట్నీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు అసహజ మరణం కోణంతో సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement