రాయగడ: ఝార్సుగుడ ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర ఆదేశానుసారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఐపీఎల్ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించారు. బ్రజరాజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో భాగంగా ఐపీఎల్–26 మ్యాచ్‌లను కేంద్రంగా చేసుకుని నిర్వహిస్తున్న సంఘటిత బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు డిజిటల్ ఫ్లాట్‌ఫారాలు, మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ ఫైనాన్సియల్ చానెళ్ల ద్వారా అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక బృందాలు రంగంలొకి దిగాయి. బ్రజరాజ్‌నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించగా అత్యంత వ్యవస్థీకృతంగా నడుస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్ బయటపడింది. ఈ దాడుల్లో మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితులు అద్దె ఇళ్లను కేంద్రాలుగా మార్చుకుని కార్యకలాపాలు నిర్వహిసున్నట్లు గుర్తించారు. ల్యాప్‌టాప్‌లు, అనేక ప్రత్యక్ష పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజల బెట్టింగ్ ధోరణులను అంచనా వేస్తు వ్యవహరించినట్లు నిందితులు తెలిపారు. వీరు కమిషన్ ఆధారిత వ్యవస్థల్లో పనిచేస్తూ పెద్ద నెట్‌వర్క్‌కు అనుసంధానమై ఉన్నట్లు వెల్లడైంది. దాడుల సమయంలో పోలీసులు భారీ మొత్తంలో ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.5,09,100 నగదు, 2 ల్యాప్‌టాప్‌లు, 41 మొబైల్ ఫోన్లు, ఒక ఇన్నొవా వాహనం, అలాగే ఒక మారుతీ బొలేరొ, సిస్టమ్ కార్డులు, డిజిటల్ బెట్టింగ్ రికార్డులు లభించాయి. ప్రాథమిక విచారణలో ఈ ముఠాకు ఇతర రాష్ట్రాలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వెనుక మరికొంత మంది కీలక నిర్వాహకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించగా బెట్టింగ్ సిండికేట్‌కు సంబంధించిన ఖాతాల్లో సుమారు రూ.3.7 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు వివరించారు. అలాగే స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఆర్థిక లావాదేవీలపై సాంకేతిక విశ్లేషణ కొనసాగుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు.


