జయపురం: స్థానిక ప్రియా థియేటర్ గ్రూపు ఆధ్వర్యంలో గీతాంజలి కల్యాణ మండపంలో నిర్వహించిన నాటక శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ నెల 18వ తేదీన శిబిరం ప్రారంభమైంది. నాటక శిక్షణ శిబిరంలో ఔత్సాహిక కళాకారులు అనేక మంది పాల్గొని శిక్షణ పొందారు. శిబిరంలో మూడు నాటకాలలో నటించే విధానంపై శిక్షణ ఇచ్చారు. ‘బప్పాకా స్వప్న’(తండ్రి కల) నాటకం, ‘పిక్నిక్’, ‘హేహో హుహూ’ నాటకాలను ఔత్సాహిక కళాకారులతో ప్రదర్శింప చేసి శిక్షణ ఇచ్చారు. బప్పాకా స్వప్న నాటకాన్ని రచించిన సమీర్ మహాపాత్రో నాటకానికి దర్శకత్వం వహించి కళాకాలకు నటన విధానం నేర్పారు. నిరంజన్ పాణిగ్రహి రచించిన పిక్నిక్ నాటకానికి ఆయనే దర్శకత్వం వహించి నాటకంలో పాత్రదారులు ఎలా నటించాలో తెలియజేశారు. అశోక్ కర్ రచించిన ‘హేహో హుహూ’ నాటకానికి ఆయనే దర్శకత్వం వహించి నటులకు తగిన సూచనలు ఇచ్చారు. గత వారం రోజులు ఔత్సాహిక నటులకు గురు పంచానన మిశ్ర, నిరంజన్ పాణిగ్రహి, గురు అబ్దుల్ ఖాదర్, గురు సమీర్ మహాపాత్ర, అమరేంద్ర హోత్త, మానస్ ఆచార్య, గురు అశోక్ కర్ (భువనేశ్వర్) శిక్షణ తరగతులను నిర్వహించారు. సమాజాన్ని చైతన్యపరచటంలో నాటకాల పాత్ర బృహత్తరమైనదని, నేడు నాటక కళలు కనుమరుగయ్యాయని నిరంజన్ పాణిగ్రహి అన్నారు. సమాజాన్ని చైతన్య పరచటంలో నాటక కళ భూమిక తెలుసుకొని కనుమరుగవుతున్న నాటకాలను పరిరక్షించేందుకు ఔత్సాహిక కళాకారులు, నటులు నాటకాలను ప్రదర్శించాలన్నారు. శిక్షణ శిబిరంలో చిన్నారులు, యువతీ, యువకులు అనేక మంది పాల్గొన్నారు.


