పర్లాకిమిడి: గజపతి జిల్లాకు నూతన ఎస్పీగా ప్రహ్లాద్ సహాయ్ మీనాను హోంశాఖ నియమించింది. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన బర్‌ఘడ్ జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు. తొలుత మల్కన్‌గిరి సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా పనిచేసిన తరువాత 2020లో నవరంగ్‌పూర్ జిల్లా ఎస్పీగా పనిచేసి తన సామర్ధ్యాన్ని నిరూపించుకుని ఉత్తమ ఎస్పీగా పేరుపొదారు. గజపతి ఎస్పీగా ప్రహ్లాద్ సహాయ్ మీనా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇన్‌చార్జి ఎస్పీగా వ్యవహరించిన ఆదనపు ఎస్పీ సునీల్ కుమార్ మహాంతి భువనేశ్వర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు ప్రోమోషన్ అయ్యారు.
రాయగడ ఎస్పీగా రాజ్‌ప్రసాద్
రాయగడ: రాయగడ జిల్లా ఎస్పీగా రాజ్‌ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎస్పీగా పని చేసిన స్వాతి ఎస్ కుమార్ భువనేశ్వర్ ఎస్‌టీఎఫ్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం రాయగడలో నెలకున్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న రాజ్ ప్రసాద్ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఆవిశ్రాంతిగా కృషి చేయాల్సి ఉంటుందని సిబ్బందితోపాటు ప్రజలు భావిస్తున్నారు.
చెరువు పునరుద్ధరణకు చర్యలు
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీలో లింగిపురం వద్ద కృష్ణచంద్ర గజపతి చెరువు దుస్థితిని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం పరిశీలించారు. ఈ చెరువు పునరుద్ధరణ పనులు జరుగకపోవడంతో రైతులు 10 హెక్టార్లలో సాగుభూమి అంతరించి పోయింది. అమొ ఒడిశా, వికసిత్ ఒడిశా పిలుపుతో అప్పటి బీజేడీ ప్రభుత్వం ఈ చెరువు మరమ్మతులు, పూడికతీతకు 2024–25 ఆర్థిక సంవంత్సరంలో రూ.4 లక్షల నిధులు కేటాయించింది. ఈ చెరువు పునరుద్ధరణ జరిగితే సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందటమే కాకుండా, చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు లబ్ధిపోందుతారని గ్రామస్తులు తెలిపారు. చెరువు పునరుద్ధరణకు సకాలంలో చర్యలు చేపడతామని ఎమ్మెల్యే రూపేష్ అన్నారు.
రుణాలు ఇప్పిస్తానని కోట్లలో స్వాహా
జయపురం: రుణాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి కోట్లాది రూపాయలు మోసం చేసిన ఒక యువకుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారిణి అర్చిత మిత్తల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తి స్థానిక కొత్తవీధికి చెందిన లక్ష్మీకాంత పండ అని వెల్లడించారు. జయపురం పట్టణ పోలీసు స్టేషన్ సభాగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరిస్తూ జయపురం కొత్తవీధిలో ‘పండ కమ్యూని కేషన్’అనే ఒక సంస్థను లక్ష్మీకాంత పండ ప్రారంభించాడని, రుణాలు ఇస్తానని ప్రజలను నమ్మించాడని, ఆ వీధిలో 30 మందికి పైగా వ్యక్తుల నుంచి రూ.కోటి సేకరించాడని వెల్లడించారు. అతడిపై వచ్చిన ఆరోపణల పై పట్టణ పోలీసు అధికారులు దర్యాప్తు చేశారని తెలిపారు. దర్యాప్తు జరిపిన తర్వాత నిందితుడు లక్ష్మీకాంత పాఢీని బాలేశ్వర్ లో అరెస్టు చేసినట్లు ఎస్‌డీపీఓ వెల్లడించారు. నిందితుడు పండ కేవలం జయపురంలోనే కాదని రాష్ట్రంలో, వివిధ ప్రాంతాల్లో ఇలాంటి సంస్థలు నెలకొల్పి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుని వద్ద దాదాపు రూ.20 లక్షల విలువైన వస్తువులు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. అందులో రూ.3 లక్షల 92 వేల నగదు, 13 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, ఒక హీరో గ్లామర్ వాహనం, విలువైన ఫర్నీచర్, ఏసీ, కంప్యూటర్ మొదలగు వస్తువులు అతడి వద్ద ఉన్నాయని వివరించారు. అలాగనే 7 సిమ్‌కార్డులు గల 9 మొబైల్ హేండ్‌సెట్ స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. ఇంకా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.


