● 8 జిల్లాల ఎస్పీలు బదిలీ
● ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం ప్రభావం
భువనేశ్వర్: శాంతిభద్రతల వ్యవస్థ పటిష్టతతో ప్రజా భద్రత మెరుగుదల దిశలో జారీ చేసిన ఆదేశాల అమలును ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సమీక్షించారు. ఈ సమీక్షకు అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) హేమంత్ శర్మ, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రజా భద్రత పట్ల ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు పోలీసు యంత్రాంగం అనుక్షణం అప్రమత్తతతో సమర్థంగా వృత్తి నైపుణ్యంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాలు జారీ అయిన స్వల్ప వ్యవధిలో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కేడర్‌లో హోం శాఖ భారీ మార్పులు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా 8 జిల్లాలకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్లను బదిలీ చేశారు. ఈ జాబితాలో నవరంగ్‌పూర్, ఖుర్దా, రాయగడ, బర్‌గడ్, నయాగఢ్, గంజాం, బౌధ్, కంధమల్ జిల్లాలు ఉన్నాయి. బదిలీ అయిన పోలీసు అధికారుల్లో 14 మంది ఐపీఎస్, నలుగురు సీనియర్ ఓపీఎస్ అధికారులు ఉన్నారు.
నవరంగ్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ మడ్కర్ సందీప్ సంపత్‌ను బదిలీ చేసి సీఐడీ–సీబీ డీఐజీగా నియమించారు. ఆయన స్థానంలో కశ్యామ్ పార్థను నవరంగ్‌పూర్ కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు. ఖుర్దా ఎస్పీ వివేకానంద శర్మను సీఐడీ–సీబీకి ఎస్పీగా బదిలీ చేశారు. గంజాం ఎస్పీ సువేందు కుమార్ పాత్రో ఖుర్దా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ అయ్యారు. కంధమల్ ఎస్పీ బీసీ హరీషా గంజాం జిల్లా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. రామేంద్ర ప్రసాద్ కంధమల్ జిల్లా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. రాయగడ ఎస్పీ స్వాతి ఎస్ కుమార్‌ను భువనేశ్వర్ ఎస్‌టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) ఎస్పీగా బదిలీ చేశారు. రాజ్ ప్రసాద్ రాయగడ కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ రంగంలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించి సవాలుతో కూడిన రంగాలలో కొత్త నాయకత్వ దృక్పథాల కార్యాచరణతో రాష్ట్రంలో సమగ్రంగా శాంతిభద్రతల వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ బదిలీలు వ్యూహాత్మకమైన ప్రక్రియ అని అధికారులు అభివర్ణించారు.


