జయపురం: జయపురం సబ్ డివిజన్‌లో ఏకై క పరిశ్రమ సేవా పేపర్‌మిల్లును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌తో ఈ నెల 28 వ తేదీన జయపురం బందు నిర్వహించాలని అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. నేడు మాజీ మంత్రి, బీజేడీ నేత రబినారాయణ నంతో అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం లో పట్టణంలో పలు కార్మిక, కర్షక సంఘాల, వ్యాపార సంఘాల ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని సేవాపేపరుమిల్లు పునరుద్ధరణ ఆందోళనలు చేపట్టాలని అభిప్రాయాలు వెల్లడించారు. ముందుగా ఈ నెల 28 వ తేదీన 12 గంటల జయపురం బంద్ నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా పలు సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ సేవా పేపరుమిల్లు జయపురం ప్రాంతంలో ప్రజలకు ఉపాధి కల్పించే ఏకై క పరిశ్రమ అని, అంతే కాకుండా మిల్లు పైనే జయపురం ఆర్థిక ప్రగతి ఆధార పడి ఉందన్నారు. మిల్లు మూత పడిన తర్వాత మిల్లులో పనిచేసే ఉద్యోగులు, శ్రామికులతో పాటు మిల్లుపై ఆధార పడి జీవిస్తున్న దాదాపు 10 వేల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడి ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేపరు మిల్లు పునరుద్ధరణ విషయంలో అటు యాజమాన్యం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని నిందించారు. ప్రభుత్వం తక్షణం తగు చర్యలు తీసుకొని మిల్లు ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మిల్లు పునరుద్ధరించేంత వరకు ఆందోళనలు చేస్తామన్నారు. ఈ నెల 28 వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు సంపూర్ణంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. వ్యాపార వర్గాలు సహకరించాలని కోరారు.


