భువనేశ్వర్: ప్రమాదకర పరిసరాల్లో మొబైలు మోజులు ప్రాణాంతకమని తాజా సంఘటన రుజువు చేసింది. ఆదివారం రైలుపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురైన యువకుడు ఆందోళనకర పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రాజస్థాన్ ప్రాంతీయుడు. నగరంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి రాజ్ కుమార్‌గా గుర్తించారు. మంచేశ్వర్ రైల్వే స్టేషన్‌లో సెల్ఫీలు తీసుకుని, రీల్స్ చిత్రీకరించడానికి అతడు రైలు కోచ్ పైకి ఎక్కడంతో అత్యంత శక్తివంతమైన ఓవర్‌హెడ్ విద్యుత్ రైలు వ్యవస్థ ధాటికి గురై విద్యుదాఘాతంతో రైల్వే ప్లాట్‌ఫారమ్‌పైకి తుళ్లిపడ్డాడు. యువకుడు తీవ్రంగా కాలి గాయపడినట్లు గుర్తించారు. ఈ పరిస్థితిలో తక్షణమే అత్యవసర చికిత్స కోసం స్థానికి రైల్వే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో సత్వర ఉన్నత చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు. సెల్ఫీలు, రీల్స్ కోసం రైలు కోచ్‌లు ఎక్కడం గానీ, నిషేధిత రైల్వే జోన్‌లలోకి ప్రవేశించడం గానీ చేయవద్దని రైల్వే అధికారులు ప్రజలను పదేపదే హెచ్చరించినా పెడ చెవిన పెట్టడంతో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు అనివార్యం అవుతున్నాయని రైల్వే వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. రైలు పైభాగంలో విద్యుత్ తీగలు అత్యంత అధిక వోల్టేజ్‌ను కలిగి ఉంటాయి. వాటిని నేరుగా తాకకపోయినా ప్రాణాంతకం కాగలవని అధికారులు తెలిపారు.


