మందస: దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని విభిన్న ప్రతిభావంతుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మోహన్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం మందసలో జిల్లా కమిటీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ రీ వెరిఫికేషన్ జరిగినా చాలామంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు రావడం లేదన్నారు. వివాహంతో సంబంధం లేకుండా అర్హత కలిగిన దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మందస మండల నూతన కమిటీ అధ్యక్షుడు ముంజేటి దేవదాస్, అందాల ఆవేష్, ఉపాధ్యక్షులు జట్టు హేమావతి, ప్రధాన కార్యదర్శి ఫిస్టు ఝాన్సీ, సభ్యులు తెప్పల పాపారావు, మామిడి జానకి, బి.జె.పి కార్యవర్గ సభ్యులు పొందర దుదిష్టి, సింహాచల మహంతి, అడ్డి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా
పాతపట్నం: ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు పట్టపగలే ఆంధ్ర నుంచి ఒడిశాకు ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. పాతపట్నం, బైదలాపురం మీదుగా పర్లాకిమిడి(ఒడిశా)లోకి ఈ రవాణా జరుగుతోంది. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలోగ్గడంతో పాటు కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ అక్రమ రవాణాను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం టాక్టర్లు ద్వారా ప్రతి రోజు తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 8గంటల అక్రమంగా తరలిస్తున్నారు. హిరమండలం మండలం భగీరథపురం, కొత్తూరు మండలం నివగాం, పొట్నూరు వద్ద వంశధార నదిలో ఇసుకను ట్రాక్టర్లు ద్వారా రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
సముద్రస్నానానికి వెళ్లి
వ్యక్తి మృతి
సంతబొమ్మాళి: భావనపాడు సముద్రతీరంలో స్నానానికి దిగి టెక్కలికి చెందిన బినాయక్‌రావు పట్నాయక్ పక్కి(నరేష్)(36) ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. విశాఖపట్నం పెద్దగంట్యాడకు చెందిన నరేష్ జీవనోపాధి కోసం టెక్కలిలో కారు మెకానిక్‌గా పనిచేస్తూ నివాసం ఉంటున్నాడు. ఆదివారం తోటి స్నేహితులు బెహరా శరత్, కోనారి మణి, నవీన్‌తో కలిసి భావనపాడు తీరానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. సముద్రంలో స్నానానికి దిగి లోపలకి వెళ్లగా అలల తాకిడికి నరేష్ మునిగిపోయాడు. మైరెన్ పోలీసులు గాలించగా రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతదేహం తీరానికి చేరింది. నరేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నౌపడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లాటరీ టికెట్ల వికేత్రలపై
కేసు నమోదు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని కృష్ణాపార్కు వద్ద లాటరీ టికెట్లు విక్రయిస్తూ నగరానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆదివారం పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 80 లాటరీ టికెట్లు, రూ.56 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలో అనధికారికంగా దాదాపు ఏడాదికాలంగా ఒడ్డు వెంకటరమణ, అనుపోజు కామేశ్వరరావు, టంకాల కామేశ్వరరావు, దేవరశెట్టి మణికంఠ, పొట్నూరు తారకరామారావు, వానపల్లి వెంకటమూర్తి లాటరీ టికెట్లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్‌ఐ హేమంత్‌కళ్యాణ్‌కు వచ్చిన సమాచారం మేరకు కృష్ణాపార్కు వద్ద ఆదివారం రాత్రి సిబ్బందితో మాటువేయగా టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డారు. వానపల్లి వెంకటమూర్తి తప్ప మిగతా ఐదుగురిపై నాలుగైదేళ్ల క్రితం సైతం ఈ కేసులున్నాయి. టీఎస్ ఏజెన్సీ ద్వారా ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తూ రోజుకు 40 నుంచి 50 వరకు టికెట్లు అమ్ముతుంటారని సీఐ చెప్పారు. అసలు సూత్రధారులైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


