● బడులు తెరిచే నాటికి విద్యార్థులకు కిట్లు ఇవ్వలేమని ప్రకటన
● విద్యా కానుకకు అంతర్జాతీయ పరిణామాలతో ముడిపెట్టిన ప్రభుత్వం
శ్రీకాకుళం, టెక్కలి: విద్యార్థి మిత్రకు సర్కారు డీజిల్ మరక అంటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ ఒక్కో విద్యార్థికి సుమారు రూ. 2,279 ఖరీదు చేస్తుంది. ఈ కిట్‌లో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫాం, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్ట్ వంటి ప్రాథమిక విద్యా సామగ్రిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కుట్టుకూలి దీని కి అదనం. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా.. ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి కొనసాగిస్తోంది. ఈ ఏడాది కూడా జూన్ 19వ తేదీన జరగబోవు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ఆర్భాటంగా విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న ఆయిల్ కొరత కారణంగా ట్రాన్స్‌పోర్టేషన్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి విద్యార్థి మిత్ర పంపిణీ మరింత ఆలస్యం అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
విద్యా శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఇది ఒక నెపం మాత్రమేనని వెండార్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్లో తేడా వచ్చిందని, గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు రెండు లక్షల 40 వేల మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలకు దూరమయ్యారని, విద్యార్థుల సంఖ్య ప్రోగ్రెసన్ రూపంలో ఇండెంట్ పెట్టడం, ప్రస్తుతం ఇండెంట్ కంటే రెండున్నర లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్ ప్రాప్తికి హిట్ల తయారీ పూర్తయిందని, మొత్తం కిట్లు కొని తీరాల్సిందేనని పట్టు పట్టడంతో రూ.60 కోట్లకుపైగా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదే అసలు కారణమని విద్యాశాఖలో పనిచేస్తున్న వారే లీకులిస్తున్నారు. గత ప్రభుత్వంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మే నెల మూడోవారా నికే మండల స్టాక్ పాయింట్లకు విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో చేరేవి. పాఠశాల పునః ప్రారంభం నాటికి పాఠశాల పాయింటుకు కిట్లు చేరవేసి విద్యారంగ పునర్నిర్మాణంపై నిబద్ధతను చాటుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థి మిత్రకు డీజిల్ మరకలు అంటిస్తోంది.


