భువనేశ్వర్: సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణకు అనేక మార్గాలు ఉన్నాయి. జటిలమైన, మేధోపరంగా బలమైన పరిశోధనలో ప్రభావవంతమైన సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణ పాతుకుపోయి ఉంటుందని ప్రొఫెసర్ మోహన శంకర్ శివప్రకాశం తెలిపారు. ఒకటి మరొకదానిని ప్రభావితం చేసే బలమైన పరిశ్రమల అనుసంధానం సుస్థిరమైన సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణ పర్యావరణ వ్యవస్థలను నిర్మించడానికి దోహదపడుతుందని, విద్యాసంస్థలు సంప్రదాయ పరిశోధన పరిధులు అధిగమించి ముందుకు సాగాలని ప్రోత్సహించారు. పరిశ్రమలతో కలిసి ఉత్పత్తుల అభివృద్ధి, లైసెన్సింగ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ముఖ్యమైన మార్గాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) సాంకేతికత వాణిజ్యీకరణపై విశ్లేషణాత్మక చర్చా కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డు – 2025 గ్రహీత ప్రొఫెసర్ మోహనశంకర్ శివప్రకాశం ముఖ్య విశ్లేషకులుగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహక సంస్థ అధ్యాపక సభ్యులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ సభ్యులతో ఆయన ముఖాముఖి సంభాషించారు. విద్యా పరిశోధనను ప్రభావవంతమైన టెక్నాలజీలుగా మరియు వాణిజ్యపరంగా లాభదాయకమైన ఉత్పత్తులుగా మార్చే మార్గాలపై లోతైన చర్చ కొనసాగించారు.
100 క్యూబ్ వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ చర్చా కార్యక్రమం నిర్వహించినట్లు ఐఐటీ డైరెక్టరు ప్రొఫెసర్ శ్రీపద్ కర్మాళ్కర్ తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ 100 క్యూబ్ కార్యక్రమం కనీ సం రూ. 100 కోట్లు విలువైన 100 స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం వహించడం లక్ష్యంగా తమ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఒడిశా ఆవిర్భావం శతాబ్ది (100 ఏళ్లు పూర్తి) 2036 నాటికి ఈ లక్ష్యాన్ని ఛేదించాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందన్నారు. సుదీర్ఘంగా 2 గంటల పాటు ఉత్సాహభరితంగా కొనసాగిన ఈ చర్చా కార్యక్రమంలో 50 మందికి పైగా పాలుపంచుకున్నారు.


