భువనేశ్వర్: కాలవైశాఖి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ప్రధానంగా బొలంగీర్ జిల్లా పట్నాగడ్ ప్రాంతంలో భారీ వడగళ్ల వాన ముంచెత్తి, ఆస్తి, వ్యవసాయ రంగానికి అపార నష్టాన్ని కలిగించింది. ఈ ప్రాంతంలో పంటలకు, ఇళ్లకు తీవ్ర నష్టం సంభవించింది. పెసర, కూరగాయల పంటలు నీట మునిగాయి. భారీ వడగళ్లు ఆస్బెస్టాస్ షీట్లను చిల్లు లు పడేలా చేసి, మట్టి పెంకులను పగలగొట్టి నివా స భవనాలను దెబ్బతీశాయి. పఢేల్ గ్రామం అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చవిచూసింది. కటక్ జిల్లా అఠొగొడొ పట్టణంలో కాలవైశాఖి తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రాంతంలో నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్‌ఏసీ) స్వాగత తోరణం కుప్పకూలిపోయింది. పాత కటక్,, సంబల్‌పూర్ రహదారిపై కరికోల్ పెట్రోల్ పంప్ సమీపంలో అఠొగొడొ భారీ కాంక్రీట్ ఎన్‌ఏసీ స్వాగత తోరణం కారుపై కూలిపోయింది. కారు నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. గాలులకు పెద్ద చెట్లు కూకటివేళ్లతో సహా పెకిలించబడ్డాయి, విద్యు త్ తీగలు తెగిపోయాయి.


