● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం
●జెడ్పీలో వినతుల స్వీకరణ
శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. దళితులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన దళితుల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, ఐఐఐటీ, మున్సిపల్ కార్పొరేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఏపీఈపీడీసీఎల్, తదితర శాఖల అధికారులతో ఎస్సీ రోస్టర్ పాయింట్ అమలుపై సమీక్షించి సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ దళితులపై దాడులు జరిగిన వెంటనే పోలీసుల స్పందించి ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు 9701305417 వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దళితుల హక్కుల పరిరక్షణ, న్యాయం అందించడంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఎస్సీ కమిషన్ 59 ఉప కులాలకు రక్షణ కవచం వంటిదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ రోస్టర్ పాయింట్ తప్పనిసరిగా అమలు జరగాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు రావాడ సీతారాం అధికారులను కోరారు. అంతకుముందు సీతారాంకి జిల్లాలోని దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో దళిత నాయకులు బోకర నారాయణరావు, కల్లేపల్లి రామ్‌గోపాలరావు,, డి.గణేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.వినాయకం, భూ గర్భ గణులు శాఖ ఉప సంచాలకులు మోహనరావు, డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోధ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, డాక్టర్ కంఠ వేణు, ఏపీఈఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్ పి.ఎం.జె.బాబు తదితరులు పాల్గొన్నారు.


