మల్కన్‌గిరి: భారతీయ సైన్యంలో అగ్నివీర్ నియామకానికి సంబంధించి మల్కన్‌గిరి జిల్లాలో యువతలో అవగాహన, నమోద్ సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే అధ్యక్షతన మంగళవారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జయపూర్ ప్రాంతీయ విద్యా డైరెక్టర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అధికారి, జిల్లా సబ్ కలెక్టర్, జిల్లా విద్యశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి, ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, గోపాలపూర్ ఏఆర్‌వో, సైనిక నియామక కార్యాలయ డైరెక్టర్ పాల్గొన్నారు. ముఖ్యంగా అగ్నివీర్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు మల్కన్‌గిరి జిల్లాలో కేవలం 25 మంది అభ్యర్థులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇది రాష్ట్రంలోనే అతి తక్కువ సంఖ్య. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేసి మరింత మంది యువతను తమ పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల, కళాశాలలో అగ్నివీర్ నమోద్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నట్టు కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ తెలిపారు.


