నెల్లిమర్ల రూరల్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని పెద్దబూరాడపేటలో కొత్తగా నిర్మించిన శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ హాజరై ఆలయాన్ని సందర్శించి, ఆంజనేయస్వామికి పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలంతా నిత్యం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా దీవించాలని భగవంతుడిని వేడుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక బాట పట్టాలని, అప్పుడే గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని తెలిపారు. రోజులో ఎంతో కొంత సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయిస్తే శారీరక శ్రమ, మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. అనంతరం పరిసర గ్రామాల్లో పర్యటించి, అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


