బస్సుకు నిప్పు.. తప్పిన పెనుముప్పు | - | Sakshi
Sakshi News home page

బస్సుకు నిప్పు.. తప్పిన పెనుముప్పు

Mar 22 2026 1:30 AM | Updated on Mar 22 2026 1:30 AM

మేల్కొని ఉండడంతో ప్రమాదం తప్పింది

శనివారం తెల్లవారు జామున 3 నుంచి 3.30 గంటల సమయంలో రామభద్రపురం గ్రామం ముందు ప్రయాణికులు టాయిలెట్స్‌ కోసం బస్సుఆపారు. వారంతా టాయిలెట్స్‌కు వెళ్లి మరలా బస్సు ఎక్కారు. రామభద్రపురం గ్రామం దాటాక బస్సు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించింది. కాలిన వాసన రావడంతో వెంటనే బస్సును పక్కకు నిలిపి దిగి చూడగా మంటలు కనిపించాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులందరినీ అప్రమత్రం చేశాను. ప్రయాణికులందరూ బస్సు దిగిపోయారు. కాసేపటికే బస్సులో ఉన్న ఎయిర్‌ బెలూన్స్‌ పేలిపోవడంతో వచ్చిన గాలికి బస్సంతా మంటలు చెలరేగాయి. భయపడిపోయాను. అందరూ మేల్కొని ఉండడంతో ప్రమాదం తప్పింది.

– సుఖదేవ్‌ బరిక్‌, ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌

రామభద్రపురం: ఆ ప్రయాణికుల పాలిట డ్రైవరే దేవుడు... ఆయన ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా... బస్సులో రేగిన అగ్నికీలలు గమనించకపోయినా ప్రమాదం ఊహకు అందేదికాదు. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. డ్రైవర్‌ అప్రమత్తతతో బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేతో పాటు 32 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే...

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన ఆరెంజ్‌ (నీలకంఠేశ్వర) ట్రావెల్స్‌ స్లీపర్‌ కోచ్‌ బస్సు రామభద్రపురం, సాలూరు మీదుగా 32 మంది ప్రయాణికులతో మల్కన్‌గిరి వెళ్తోంది. ప్రయాణికుల్లో అధికమంది ఒడిశా రాష్ట్రానికి చెందిన వారే. మల్కన్‌గిరి, చెములగుడ, దామన్‌జోడి, జయపూర్‌ తదితర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి, స్వగ్రామాలకు వెళ్తున్నారు. 26వ జాతీయ రహదారిపై వెళ్తుండగా రామభద్రపురం మండలం తారాపురం సమీపంలోని పూడివారి కళ్లాల వద్దకు వచ్చేసరికి శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో బస్సు టైరు పేలినట్లు డ్రైవర్‌కు అనిపించింది. డ్రైవర్‌ సఖదేవ్‌ బరక్‌ వెంటనే బస్సును పక్కకు నిలిపి కిందకు దిగి చూశాడు. అప్పటికే బస్సు వెనుక మంటలు చెలరేగాయి. వెంటనే ఆయన అప్రమత్తమై ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. కిందకు దిగిపోవాలంటూ గట్టిగా కేకలు వేశాడు. అప్పటికి ఒక గంట ముందు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సును రామభద్రపుం ముందు నిలపడంతో ప్రయాణికులందరూ మేల్కొని ఉన్నారు. డ్రైవర్‌ కేకలకు వెంటనే బస్సు దిగిపోయారు. బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, బస్సు ఎయిర్‌ బెలూన్లు పేలిపోవడంతో క్షణాల్లో మంటలు బస్సంతా వ్యాపించాయి. ప్రయాణికులతో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ భయంతో వణికిపోయారు. వీరి హాహాకారాలకు ఘటనా స్థలానికి సమీపంలోని తారాపురం గ్రామస్తులు పలువురు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బొబ్బిలి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వి.ప్రసాదరావు బాడంగి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను అదుపుచేశారు. సాలూరు ఫైర్‌ స్టేషన్‌కు ఫోన్‌చేసినా స్పందించలేదని స్థానికులు వాపోయారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ

ప్రమాద స్థలాన్ని బొబ్బిలి డివిజన్‌ ఆర్డీఓ రామ్మోహనరావు పరిశీలించారు. ప్రమాద ఘటనతో పాటు ప్రయాణికుల వివరాలు, అందరూ సురక్షితంగా బయటపడిన అంశాలను సీఐ, ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారు.

క్లూస్‌టీం పరిశీలన..

బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు టైరు పేలి ప్రమాదం జరిగిందా? లేదంటే ఏమైనా షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరం నుంచి వచ్చిన క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. బస్సులోని పలు వస్తువులతో పాటు విద్యుత్‌ వైర్‌లు కొన్ని పట్టుకెళ్లారు. బస్సు డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కళ్లముందే తాము ప్రయాణిస్తున్న బస్సు కాలిపోవడాన్ని చూసి ప్రయాణికులు హాహాకారాలు చేశారు. తమ సామగ్రి కాలిపోతోందంటూ ఘొల్లుమన్నారు. రూ.10లక్షల విలువైన బంగారు హారం, చేతిగాజులు, ఉంగరాలు, రూ.7వేలతో కూడిన బ్యాగు కాలిపోతోందంటూ శాంతిలత అనే ప్రయాణికురాలు కన్నీరుపెట్టింది. అయితే... మంటలు పూర్తిగా ఆర్పాక బూడిదలో చెవిదిద్ది మినహా మిగిలిన బంగారు ఆభరణాలు లభించడంతో సంతోషం వ్యక్తంచేసింది. ఆభరణాలు అప్పగించిన సీఐ, ఎస్‌ఐకు కృతజ్ఞతలు తెలిపి బంధువుల సాయంతో సెములగూడకు పయనమైంది. చాలామంది ప్రయాణికుల విలువైన సామగ్రి కాలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు. అదే బస్సులో మల్కన్‌గిరి వెళ్తున్న ఒడిశా రాష్ట్రం చిత్రకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌(ఐ) ఎమ్మెల్యే మంగం ఖిల్లా ప్రమాదం నుంచి బయటపడి, వేరే ట్రావెల్‌ బస్సులో మల్కన్‌గిరి చేరుకున్నారు.

రామభద్రపురం వద్ద దగ్ధమైన ఒడిశా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

బస్సులో ప్రయాణిస్తున్న ఒడిశా ఎమ్మెల్యేతో పాటు 32 మంది ప్రయాణికులు సురక్షితం

డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆధారాలు సేకరించిన క్లూస్‌టీం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement