మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితి కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన చారిదేవా దేవీ అమ్మవారి బడాయాత్ర శనివారంతో ముగిసింది. చివరి రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. యాత్రలో భాగంగా ప్రతిరోజూ అన్నదానం ఏర్పాటు చేశారు. యాత్రకు స్థానికులతో పాటు ఆంధ్ర, చత్తీష్‌ఘడ్ నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. అలాగే అగ్నిమాపక, వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.
పట్టుబడిన చోరీకి గురైన వాహనం
రాయగడ: స్థానిక రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీవో సిబ్బంది శనివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో చోరీకి గురైన ఒక ద్విచక్ర వాహనాన్ని సిబ్బంది పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా ఆర్టీవో సిబ్బంది విస్తృతంగా వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక దొంగతనానికి గురైన ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. నంబర్ ప్లేట్ మార్చి వాహనాన్ని నడిపుతున్నట్లు గుర్తించారు. కలహండి జిల్లాకు చెందిన వాహనంగా గుర్తించిన సిబ్బంది, ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. అయితే వాహన చోదకుడు తాను ఒక సెకండ్ హ్యాండ్ షోరూంలో ఈ వాహనాన్ని ఖరీదు చేసినట్లు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి రూ.70 వేలు జరిమానా కింద వసూలు చేశారు.


