చాటిచెప్పాం | - | Sakshi
Sakshi News home page

చాటిచెప్పాం

Mar 22 2026 1:30 AM | Updated on Mar 22 2026 1:30 AM

మిస్‌, మిసెస్‌ ఉగాది విజేతలకు బహుమతులు అందజేస్తున్న వైష్ణవీ చైతన్య

కోల్‌కతా కళాకారుల నృత్యప్రదర్శన

రాయగడ: ఉగాది వంటి జన వేదికలో మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే అవకాశం కలిగిందని జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు అన్నారు. రెండు రోజులుగా కొల్లిగుడ మైదానంలో సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా ఉగాది ఉత్సవాలను జిల్లా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు వరుణుడి వల్ల ఉత్సవాల ప్రారంభోత్సవం కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రజలు ఉత్సవాలను తిలకించేందుకు భారీ ఎత్తున తరలిరావడం సంతోషకరమన్నారు. అందరి ఆదరాభిమానాలతో ఇంత ఉన్నత స్థాయికి చేరుకున్నానని, నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని కొండబాబు అన్నారు. రాయగడలో తెలుగు, ఒడియా అన్న బేధభావనలకు తావులేకుండా కలసిమెలసి ఇటువంటి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

అలరించిన కార్యక్రమాలు..

ముగింపు ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రముఖ గాయకుడు స్వరాగ్‌ కీర్తన్‌ పాటలతో ఉర్రూతలూగించారు. టాలీవుడ్‌ హీరొయిన్‌ వైష్ణవి చైతన్య ప్రేక్షకులతో మమేకమై తన సినీరంగ ప్రవేశం గురించి వివరించి ముచ్చటగొలిపించారు. జబర్దస్త్‌ సద్దాం బృందం తన హాస్యంతో ప్రేక్షకులని మైమరరించారు. ఇండియన్‌ ఐడల్‌ బ్యాండ్‌ సాయి పవన్‌ తన మ్యూజిక్‌తో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. వాటర్‌ బాటిల్‌, సూట్‌కేసుల సహాయంతో మ్యూజిక్‌ వినిపించి అందరినీ ఆకర్షించారు. కోల్‌కతాకు చెందిన పాపులర్‌ నృత్య బృందం ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి.

ప్రముఖులకు సన్మానం..

ప్రముఖ వేద పండితులు రేజేటి శ్రీనివాస్‌ శర్మ, రేజేటి శ్రీరామశర్మలను వేదికపై ఉత్సవ కమిటీ ఘనంగా సన్మానించింది. ఉగాదిని పురష్కరించుకుని మహిళా విభాగం నిర్వహించిన మిస్‌ ఉగాది, మిసెస్‌ ఉగాది పోటీల్లో గెలుపొందిన విజేతలకు నటి వైష్ణవీ చైతన్య బహుమతులు అందజేశారు. అనంతరం వైష్ణవీ చైతన్యను ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు, సమాఖ్య సభ్యులు ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement