గిర్లలో వారపుసంత ప్రారంభం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి గిర్లా పంచాయతీ ప్రజల కోసం గిర్ల గ్రామంలో వార సంతను శనివారం ప్రారంభించారు. కొట్‌పాడ్ సమితి ఉపాధ్యక్షులు తోపన్ పాణిగ్రహి, పంచాయితీ వార్డుల సభ్యులు ముందుగా మా మవుళీ మందిరంలో ఘనంగా పూజలు చేసిన తరువాత తోపన్ పాణిగ్రహి వారసంతకు ప్రారంభోత్సవం చేశారు. పంచాయతీలో మార్కెట్ కోసం సిమెంట్ అరుగులు ఏర్పాటు చేసినప్పటికీ వ్యాపారులెవరూ అక్కడ దుకాణాలు పెట్టలేదు. గిర్ల గ్రామం మధ్యలో రోడ్డు పక్కన సాయంత్రం దుకాణాలు పెట్టి వ్యాపారం చేయటం వలన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. అందుచేత గిర్ల గ్రామంలో వారపు సంత, మార్కెట్ ఏర్పాటు చేయాలని పంచాయతీ ప్రజలు ఎంతో కాలం నుంచి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక తీరింది. తాజాగా ప్రారంభించిన వార సంతకు పలు గ్రామాల నుంచి చిరు వ్యాపారులు కాయకూరలు, ఇతర సరుకులతో దుకాణాలు పెట్టారు. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటెత్తారు. ఇంతవరకు గిర్ల పంచాయతీ ప్రజలు కాయకూరలతో పాటు నిత్యావసర వస్తువుల కోసం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని కొట్‌పాడ్‌కు వెళ్లేవారు. ఇప్పుడు ఆ కష్టం తప్పిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వారపు సంత ప్రారంభంలో జిల్లా పరిషత్ సభ్యులు గీతా మఝి, త్రిపతి చలాన్, యువజన కాంగ్రెస్ నాయకుడు కురమ్‌నాత్ మఝి, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
గిర్లలో వారపుసంత ప్రారంభం


